ఆసన్‌సోల్‌లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ
ఆసన్‌సోల్. పశ్చిమ బెంగాల్‌లో కీలక లోక్‌సభ స్థానం. గత ఉప ఎన్నికలో బీజేపీని ఓడించిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ‘షాట్‌గన్’, ‘బిహారీ బాబు’గా ప్రసిద్ధుడైన బాలీవుడ్ దిగ్గజం, సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్న సిన్హా టీఎంసీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. సీనియర్ నేత సురేంద్రజీత్‌సింగ్ అహ్లువాలియాను బీజేపీ బరిలో నిలిపింది. ఈ హాట్ సీట్‌లో
నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది...
ఆసన్‌సోల్‌లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ
హై ప్రొఫైల్ లోక్‌సభ స్థానమైన ఆసన్‌సోల్‌లో హిందీ మాట్లాడేవారు ఎక్కువ. జార్ఖండ్ సరిహద్దు కావడమే అందుకు కారణం. ఇక్కడ పరిశ్రమలు అధికం. రాణిగంజ్, పాండవేశ్వర్, జమురియాల్లో బొగ్గు గనులున్నాయి.
దాంతో బిహార్, యూపీ వలస కారి్మకులు ఎక్కువ. తాగునీటి ఎద్దడి, అక్రమ మైనింగ్ ఇక్కడి ప్రధాన సమస్యలు. ఒకప్పుడు సీపీఎం కంచుకోట. 2014లో దానికి బీటలు వారాయి. బీజేపీ నుంచి బాబుల్ సుప్రియో బరాల్ గెలుపొందారు. 2019లోనూ ఆ పరంపరను కొనసాగించారు. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సుప్రియో తృణమూల్‌లో చేరడంతో ఉప ఎన్నిక జరిగింది. టీఎంసీ నుంచి శత్రుఘ్న సిన్హా గెలుపొందారు.
అహ్లూవాలియాపైనే బీజేపీ ఆశలు...
ఈసారి బీజేపీ తమ తొలి జాబితాలోనే భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్‌కు ఆసన్‌సోల్ టికెటిచ్చింది. తన పాటల్లో మహిళలను అగౌరవపరిచే వ్యక్తికి టికెటిచ్చారంటూ టీఎంసీ తదితర పక్షాలు విమర్శలు గుప్పించాయి. దాంతో పవన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అనంతరం ‘సర్దార్జీ’గా పిలుచుకునే ఎస్.ఎస్. అహ్లువాలియాకు బీజేపీ టికెట్ దక్కింది. ఆయన రాజ్యసభ మాజీ సభ్యుడు.
2014లో డార్జిలింగ్, 2019లో బర్ధమాన్–దుర్గాపూర్ లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందారు. ఆయన కచి్చతంగా నెగ్గుతారని బీజేపీ అంటోంది. ఎంపీగా పార్లమెంటు ముఖమే చూడని వ్యక్తి ప్రజా సమస్యలను ఏం పట్టించుకుంటారన్న టీఎంసీ విమర్శలను అహ్లూవాలియా తిప్పికొడుతున్నారు. ‘‘నేను సర్దార్‌ను. ఆసన్‌సోల్ బిడ్డను. ఇక్కడే పుట్టి పెరిగా. నా మూలాలిక్కడే ఉన్నాయి. నా ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షే నన్నిక్కడికి నడిపించింది’’ అంటున్నారు.
భారీ మెజారిటీపై శత్రుఘ్న కన్ను
శత్రుఘ్న సిన్హా పూర్వాశ్రమంలో బీజేపీ నాయకుడే కావడం విశేషం! పట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. 2022లో టీఎంసీకి మారారు. అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తన బలమంటున్నారాయన. ‘‘ఎంపీగా రెండేళ్లలో చేసిన కృషే నా తరఫున మాట్లాడుతుంది. పైగా ఆసన్‌సోల్‌లో యూపీ, బిహార్ కారి్మకుల సంఖ్య చాలా ఎక్కువ. ఈసారి మరింత భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని ధీమాగా చెబుతున్నారు.
సీపీఎం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జహనారా ఖాన్ బరిలో ఉన్నారు. లోక్‌సభకు పోటీ చేయడం ఆమెకిదే తొలిసారి. 55 ఏళ్ల జహనారాది దిగువ మధ్యతరగతి నేపథ్యం. రెండుసార్లు జమురియా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ‘‘ఆసన్‌సోల్ పదేళ్లుగా ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ సుప్రియోలు, సిన్హాలు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదు. గ్రామీణ గిరిజనులు, మైనారిటీలు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. పదేళ్లలో ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ కేబుల్స్ సహా ఎన్నో కర్మాగారాలు మూతపడ్డాయి’’ అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment