‘‘పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్ బొల్లా తన లోపాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు? అనేది ‘శ్రీకాంత్’ సినిమా కథ. కళ్లు లేకుండా జీవితాన్ని గెలవడమన్నది చాలా పెద్ద విషయం. అందుకే శ్రీకాంత్‌లాంటి గొప్ప వ్యక్తి కథతో రూపొందిన ‘శ్రీకాంత్’ మూవీలో నటించడం గౌరవంగా ఉంది’’ అని నటి జ్యోతిక అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్ బొల్లా (అంధ పారిశ్రామికవేత్త) బయోపిక్‌గా రూపొందిన హిందీ చిత్రం ‘శ్రీకాంత్’. శ్రీకాంత్ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటించారు.
తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. టీ సిరీస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్‌ప్రోడక్షన్స్పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, నిధి పర్మార్ హీరానందని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జ్యోతిక హైదరాబాద్‌లో మాట్లాడుతూ– ‘‘తుషార్‌గారు ‘శ్రీకాంత్’ కథ చెప్పినప్పుడు షాక్‌కి గురయ్యాను.
శ్రీకాంత్ బొల్లాలాంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడా? అనిపించింది. పూర్తి కథ వినగానే కచ్చితంగా ఈ మూవీలో భాగమవ్వాలని వెంటనే ఒప్పుకున్నాను. శ్రీకాంత్‌గారి పాత్రలో రాజ్‌కుమార్ రావు నటన అద్భుతం. ఈ మూవీలో టీచర్ పాత్ర చేశాను. నేను ఉపాధ్యాయురాలిగా నటించిన మూడో చిత్రం ఇది (నవ్వుతూ). శ్రీకాంత్‌ని ప్రభావితం చేసే గొప్ప పాత్ర చేశాను. నా భర్త (హీరో సూర్య) తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నేను తెలుగులో నటించి చాలా రోజులైంది. మంచి పాత్ర కుదిరితే నటిస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment