Sakshi News home page

IPL 2024: ముంబైని ఢీకొట్టనున్న పంజాబ్‌.. రోహిత్‌ శర్మకు చాలా ప్రత్యేకం

Published Thu, Apr 18 2024 12:59 PM

IPL 2024: Punjab Kings Taking On Mumbai Indians At Home Ground Mullanpur Today - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 18) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. చండీఘడ్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబై ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు ఈ మ్యాచ్‌ 250వ మ్యాచ్‌ (ఐపీఎల్‌లో) కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. రోహిత్‌ గత మ్యాచ్‌లో సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉండటం కూడా ఈ మ్యాచ్‌కు హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. 

ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్ల ప్రదర్శన ఆశాజనకంగా లేనప్పటికీ.. రోహిత్‌ శర్మపై మాత్రం అందరి ఫోకస్‌ ఉంది. హిట్‌మ్యాన్‌ గత మ్యాచ్‌ ఫామ్‌ను కొనసాగించి మరోసారి మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను పంజాబ్‌ తమ సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ అభిమానులకు వారిపై పెద్దగా అంచనాలు లేవు. ఉన్న ఒకే ఒక స్టార్‌ ఆటగాడు శిఖర్‌ ధవన్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.

అతని గైర్హాజరీలో సామ్‌ కర్రన్‌ పంజాబ్‌ను ముందుండి నడిపించనున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా  సంచలన ప్రదర్శనలు చేస్తున్న శశాంక్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మలపై పంజాబ్‌ ఫ్యాన్స్‌ అంచనాలు పెట్టుకున్నారు. వీరిద్దరు మినహాయించి పంజాబ్‌పై పెద్దగా ఆశలు లేవు.

మరోవైపు ప్రత్యర్ది ముంబై ఇండియన్స్‌లో రోహిత్‌ శర్మతో పాటు పరిశీలించదగ్గ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌, రొమారియో షెపర్డ్‌, జస్ప్రీత్‌ బుమ్రాలపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ముంబైను నిలువరించలేదు. జానీ​ బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌, రబాడ లాంటి విదేశీ ప్లేయర్లు విశ్వరూపం ప్రదర్శిస్తేనే పంజాబ్‌కు విజయావకాశాలు ఉంటాయి. 

ఈ సీజన్‌లో ఆయా జట్ల పరిస్థితిని పరిశీలిస్తే.. రెండింటి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పంజాబ్‌, ముంబై జట్లు పాయింట్ల పట్టికలో వరుసగా 8, 9 స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్ల మధ్య హెడ్‌ టు హెడ్‌ రికార్డుల విషయానికొస్తే.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ముంబై 16, పంజాబ్‌ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement