టి20 మెగా టోర్నీకి భారత జట్టు ప్రకటన
రిషభ్ పంత్ పునరాగమనం
సామ్సన్, దూబే, యశస్వి జైస్వాల్‌లకు అవకాశం
గిల్, రాహుల్, రింకూలకు దక్కని చోటు
అనుభవజ్ఞులకే అవకాశమిచ్చిన సెలక్టర్లు
టి20 ప్రపంచకప్ సమరాన్ని గెలిచేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరోసారి అనుభవాన్నే నమ్ముకుంది. ఐపీఎల్‌లో అద్భుత బ్యాటింగ్‌తో కొందరు కుర్రాళ్లు అదరగొడుతున్నా... సీనియర్లకు ప్రాధాన్యతనిచ్చింది. దీంతో పాటు ప్రస్తుతం ఫామ్ గొప్పగా లేకున్నా... అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇప్పటికే ఎంతో కొంత ప్రభావం చూపించిన వారిపైనే కమిటీ విశ్వాసం ఉంచింది.
గత టి20 వరల్డ్ కప్‌లో ఆడిన 9 మందికి ఈసారి మళ్లీ అవకాశం కర్నీచింది. అందుకే వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ దాదాపుగా అంచనాలకు తగినట్లుగానే సాగింది. ఒకరిద్దరు ఆటగాళ్ల ఎంపిక విషయంలో కాస్త ఆశ్చర్యకర నిర్ణయాలు కనిపించినా... మొత్తంగా అర్హత కలిగిన వారికే అమెరికా–వెస్టిండీస్ వీసా లభించింది.
గత వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత పూర్తిగా కుర్రాళ్లతో టి20ల్లో బోర్డు కొత్త ప్రయోగాలు చేసినా... తర్వాతి మెగా టోర్నీకి వచ్చేసరికి మళ్లీ తమ పాత ప్రణాళికకే కట్టుబడటం చెప్పుకోదగ్గ అంశం.
అహ్మదాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 9వ టి20 ప్రపంచకప్ కోసం భారత సెలక్టర్లు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బోర్డు సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశమై ఆటగాళ్లను ఎంపిక చేసింది. రోహిత్ శర్మ వరుసగా రెండో టి20 ప్రపంచకప్‌లో కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనుండగా... 2022లో ఆ్రస్టేలియా గడ్డపై టి20 వరల్డ్ కప్‌లో ఆడిన వారిలో 9 మంది ఈసారీ టీమిండియా చాన్స్ దక్కించుకున్నారు.
గత టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. సెలక్టర్లు ప్రకటించిన జట్టులో నలుగురు బ్యాటర్లు, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. మరో నలుగురు ఆటగాళ్లను ‘రిజర్వ్’లుగా కూడా ఎంపిక చేశారు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే వరల్డ్ కప్‌లో గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్ జూన్ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.
ఆ తర్వాత జూన్ 9, 12, 15 తేదీల్లో వరుసగా పాకిస్తాన్, అమెరికా, కెనడా జట్లను టీమిండియా ఎదుర్కొంటుంది. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ చేరని జట్ల ఆటగాళ్లతో కూడిన మొదటి బృందం ఈ నెల 21న ముందుగా కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు అమెరికాకు బయల్దేరుతుంది.
జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్‡్షదీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.
ఐపీఎల్ ప్రదర్శనతోనే...
జట్టు ఎంపికలో తాజా ఐపీఎల్ ప్రదర్శనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారా అంటే అవునని, కాదని కూడా సమాధానం వస్తుంది. చెన్నై తరఫున మిడిలార్డర్‌లో సిక్సర్లతో చెలరేగిపోతున్న శివమ్ దూబేకు ఐపీఎల్ కారణంగానే పిలుపు దక్కింది. ఈ టోర్నీలో అతను ఏకంగా 172.41 స్ట్రయిక్‌రేట్‌తో 350 పరుగులు సాధించాడు.
భారత్‌కు ఆడిన 21 టి20ల్లో కూడా అతను ఆకట్టుకున్నాడు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకొని ఐపీఎల్‌లో రాణిస్తున్న రిషభ్ పంత్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. లీగ్‌లో అతను 158.58 స్ట్రయిక్‌రేట్‌తో 398 పరుగులు చేశాడు. అయితే పరుగులకంటే పూర్తి ఫిట్‌గా పంత్ కనిపించడం కూడా సానుకూలాంశంగా మారింది.
మరోవైపు రెండో వికెట్ కీపర్‌గా కేరళకు చెందిన సంజూ సామ్సన్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో కెప్టెన్ గా రాజస్తాన్ రాయల్స్ టీమ్‌ను సమర్థంగా నడిపించడంతో పాటు 161.08 స్ట్రయిక్‌రేట్‌తో సామ్సన్ 385 పరుగులు సాధించాడు.
ఎవరు... ఎందుకు... ఎలా?
2022 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన ఆడిన జట్టుతో పోలిస్తే రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, హార్దిక్, అక్షర్, అర్‡్షదీప్, చహల్, బుమ్రా (టోర్నీకి ముందు గాయంతో తప్పుకున్నాడు) తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. 2021, 2022లో వరల్డ్ కప్‌లలో ఆడిన జట్టులో దాదాపు అదే టాప్–6 ఇప్పుడు కూడా మళ్లీ ఎంపికయ్యారు.
కేఎల్ రాహుల్ స్థానంలో యశస్వి రావడం మినహా ఎలాంటి మార్పూ లేదు. యశస్వి ఈ సీజన్ ఐపీఎల్‌లో వరుస వైఫల్యాల తర్వాత సెంచరీతో ఆకట్టుకోవడంతో అతనికి అవకాశం దక్కింది. బ్యాటింగ్‌లో ఇప్పుడు కావాల్సిన ‘ఫైర్’ లేదని ఎన్ని విమర్శలు వస్తున్నా అగ్రశ్రేణి బ్యాటర్లుగా రోహిత్, కోహ్లిల స్థానం ఎప్పుడూ ప్రశ్నార్ధకం కాదు.
సూర్యకుమార్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రవీంద్ర జడేజా కూడా గొప్ప ప్రదర్శన చేయకపోయినా ఆల్‌రౌండ్ నైపుణ్యం అతనికి కలిసొచ్చింది. జడేజా ఉన్న తర్వాత అక్షర్ పటేల్ ఎంపిక కూడా కాస్త ఆశ్చర్యకరమే.
హార్దిక్ మళ్లీ...
ఇటీవల ఆటలో వైఫల్యాలతో పాటు ముంబై కెప్టెన్సీ వ్యవహారాలతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకు సెలక్టర్లు మాత్రం అండగా నిలిచారు. వన్డే వరల్డ్ కప్‌లో గాయపడి కోలుకున్న తర్వాత భారత్‌కు ఆడకపోయినా అతనిపై నమ్మకముంచారు.
ఐపీఎల్‌లోనూ విఫలమైనా... అతని తరహాలో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్థానం కోసం ప్రత్యామ్నాయం లేక ఎంపిక చేయక తప్పలేదు. దూబే అస్సలు బౌలింగ్ చేయకపోవడం, హార్దిక్ ఎన్నో కొన్ని ఓవర్లు వేస్తుండటం వల్ల కూడా అతని స్థానానికి ఢోకా లేకుండా పోయింది.
నలుగురు స్పిన్నర్లతో...
అమెరికాలో తొలిసారి వరల్డ్ కప్ జరుగుతుండంతో కొత్తగా అక్కడ తయారు చేస్తున్న పిచ్‌లు ఎలా ఉంటాయో సరిగ్గా ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. అయితే స్పిన్‌కు అవకాశం ఉంటే తమ అన్ని అస్త్రాలను వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. జడేజా, అక్షర్‌లతో పాటు కుల్దీప్, యుజువేంద్ర చహల్‌లు జట్టులో ఉన్నారు.
కుల్దీప్ చాలా కాలంగా మంచి ఫామ్‌లో ఉండగా... గత రెండు సిరీస్‌లలో భారత జట్టులో చోటు దక్కించుకోని చహల్ పునరాగమనం చేసి తొలిసారి టి20 వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వీరిని వాడుకోవచ్చు. బుమ్రాకు తోడుగా అర్‡్షదీప్, సిరాజ్‌లను ఎంపిక చేశారు.
ఈ ఫార్మాట్‌లో గొప్ప ప్రదర్శన లేకపోయినా, ఐపీఎల్‌లోనూ పెద్దగా రాణించలేకపోతున్నా... ప్రస్తుత స్థితిలో అనుభవం ఉన్న పేసర్ అతనే కావడంతో సిరాజ్‌కు తొలిసారి టి20 ప్రపంచకప్ ఆడే చాన్స్ లభించింది. లెఫ్టార్మ్ పేసర్ కావడమే అర్‡్షదీప్ బలం. కొంత కాలంగా లయ కోల్పోయి ఇబ్బంది పడుతున్నా అర్‡్షదీప్‌ను సెలక్టర్లు మళ్లీ నమ్మారు.
గత వరల్డ్ కప్‌లో సెమీస్ ఓటమి తర్వాత మళ్లీ అంతర్జాతీయ టి20 ఆడని రాహుల్‌ను తప్పించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతని స్ట్రయిక్‌రేట్ కూడా అంతంత మాత్రమే. రాహుల్ తరహాలోనే శుబ్‌మన్ గిల్ కూడా ఈ ఫార్మాట్‌లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు.
పాపం రింకూ సింగ్...
వరల్డ్ కప్ జట్టు ఎంపికలో అన్ని రకాలుగా చర్చకు దారి తీసిన విషయం రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడం. విధ్వంసకర బ్యాటింగ్‌తో గత ఏడాది ఐపీఎల్ నుంచి అతను తానేంటో నిరూపించుకున్నాడు. లోయర్ మిడిలార్డర్‌లో ఫినిషర్‌గా సత్తా చాటాడు.
భారత్ తరఫున లభించిన పరిమిత అవకాశాల్లో (11 ఇన్నింగ్స్‌లు) ఏకంగా 176.23 స్ట్రయిక్ రేట్, 89 సగటుతో పరుగులు సాధించాడు. కానీ చివరకు వచ్చేసరికి అతనికి వరల్డ్ కప్ చాన్స్ లభించలేదు. ఈసారి ఐపీఎల్‌లో గొప్పగా ఆడకపోవడం వాస్తవమే అయినా కోల్‌కతా టాపార్డర్ రాణిస్తుండటంతో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు.
9 మ్యాచ్‌లలో కేవలం 82 బంతులే ఆడే చాన్స్ దక్కింది. మిడిలార్డర్‌లో భారీ షాట్లు కొట్టే సామర్థ్యం ఉన్న బ్యాటర్ కోసం జరిగిన చర్చలో రింకూపై దూబేదే పైచేయి అయింది. ఒకవేళ తుది జట్టులో హార్దిక్‌ను తప్పించాల్సి వచ్చినా... దూబే బౌలింగ్ ఎంతో కొంత ఉపయోగపడగలదని సెలక్టర్లు భావించారు.
రోహిత్ శర్మ
వయసు: 37
ఆడిన టి20లు: 151
చేసిన పరుగులు: 3974
అత్యధిక స్కోరు: 121 నాటౌట్
సెంచరీలు: 5
అర్ధ సెంచరీలు: 29
స్ట్రయిక్‌రేట్: 139.97
ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 8
విరాట్ కోహ్లి
వయసు: 35
ఆడిన టి20లు: 117
చేసిన పరుగులు: 4037
అత్యధిక స్కోరు: 122 నాటౌట్
సెంచరీలు: 1
అర్ధ సెంచరీలు: 37
స్ట్రయిక్‌రేట్: 138.15
ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 5
సూర్యకుమార్
వయసు: 33
ఆడిన టి20లు: 60
చేసిన పరుగులు: 2141
అత్యధిక స్కోరు: 117
సెంచరీలు: 4
అర్ధ సెంచరీలు: 17
స్ట్రయిక్‌రేట్: 171.55
ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2
హార్దిక్ పాండ్యా
వయసు: 30
ఆడిన టి20లు: 92
చేసిన పరుగులు: 1348
అత్యధిక స్కోరు: 71 నాటౌట్
అర్ధ సెంచరీలు: 3
స్ట్రయిక్‌రేట్: 139.88
తీసిన వికెట్లు: 73
ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 3
రిషభ్ పంత్
వయసు: 26
ఆడిన టి20లు: 66
చేసిన పరుగులు: 987
అత్యధిక స్కోరు: 65 నాటౌట్
అర్ధ సెంచరీలు: 3
స్ట్రయిక్‌రేట్: 126.37
ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2
శివమ్ దూబే
వయసు: 30
ఆడిన టి20లు: 21
చేసిన పరుగులు: 276
అత్యధిక స్కోరు: 63 నాటౌట్
అర్ధ సెంచరీలు: 3
తీసిన వికెట్లు: 8
స్ట్రయిక్‌రేట్: 145.26
ఇదే తొలి టి20 వరల్డ్‌కప్
అర్‡్షదీప్ సింగ్
వయసు: 25
ఆడిన టి20లు: 44
తీసిన వికెట్లు: 62
ఉత్తమ బౌలింగ్: 4/37
ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 1
యుజువేంద్ర చహల్
వయసు: 33
ఆడిన టి20లు: 80
తీసిన వికెట్లు: 96
ఉత్తమ బౌలింగ్: 6/25
ఇదే తొలి టి20 వరల్డ్‌కప్
కుల్దీప్ యాదవ్
వయసు: 29
ఆడిన టి20లు: 35
తీసిన వికెట్లు: 59
ఉత్తమ బౌలింగ్: 5/17
ఇదే తొలి టి20 వరల్డ్‌కప్
రవీంద్ర జడేజా
వయసు: 35
ఆడిన టి20లు: 66
చేసిన పరుగులు: 480
అత్యధిక స్కోరు: 46 నాటౌట్
స్ట్రయిక్‌రేట్: 125.32
తీసిన వికెట్లు: 53
ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 5
సంజూ సామ్సన్
యశస్వి జైస్వాల్
వయసు: 22
ఆడిన టి20లు: 17
చేసిన పరుగులు: 502
అత్యధిక స్కోరు: 100
సెంచరీలు: 1
అర్ధ సెంచరీలు: 4
స్ట్రయిక్‌రేట్: 161.93
ఇదే తొలి టి20 వరల్డ్‌కప్
జస్‌ప్రీత్ బుమ్రా
వయసు: 30
ఆడిన టి20లు: 62
తీసిన వికెట్లు: 74
ఉత్తమ బౌలింగ్: 3/11
ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2
మొహమ్మద్ సిరాజ్
వయసు: 30
ఆడిన టి20లు: 10
తీసిన వికెట్లు: 12
ఉత్తమ బౌలింగ్: 4/17
ఇదే తొలి టి20 వరల్డ్‌కప్
అక్షర్ పటేల్
వయసు: 30; ఆడిన టి20లు: 52
చేసిన పరుగులు: 361
తీసిన వికెట్లు: 49
ఉత్తమ బౌలింగ్: 3/9
ఇదే తొలి టి20 వరల్డ్‌కప్
Comments
Please login to add a commentAdd a comment