మహిళల టి20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ప్రకటన
హైదరాబాద్ బౌలర్ అరుంధతి రెడ్డికి చోటు
అక్టోబర్ 3 నుంచి యూఏఈలో మెగా టోర్నీ
అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకునేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరగనున్న టి20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో కూడిన ఈ జట్టుకు ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా... ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనున్న మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్య పరాజయంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత జట్టు నుంచి ఉమా ఛెత్రీ తప్ప మిగిలిన ప్లేయర్లందరూ టి20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యారు.
షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. ఆసియా కప్ సందర్భంగా వేలికి గాయమైన స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌తో పాటు మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న వికెట్ కీపర్ యస్తిక భాటియాను కూడా జట్టులోకి ఎంపిక చేశారు. అయితే వీరిద్దరూ ఫిట్‌నెస్ సాధిస్తేనే యూఏఈకి వెళ్లనున్నారు. టాపార్డర్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానుండగా... హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఫినిషర్ల పాత్ర పోషించనున్నారు.
దీప్తి శర్మ, ఆశ శోభన, రాధ యాదవ్ రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండగా... రేణుక సింగ్, అరుంధతి రెడ్డి పేస్ బాధ్యతలు మోయనున్నారు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పూజ వస్త్రకర్ జట్టులో చోటు దక్కించుకుంది. ‘ఇది సమతూకమైన జట్టు. యస్తిక, శ్రేయాంక గాయాల నుంచి కోలుకొని టోర్నీ ఆరంభానికి సిద్ధమవుతారు’ అని భారత మాజీ కెపె్టన్ డయానా ఎడుల్జీ పేర్కొన్నారు. టోర్నీలో భాగంగా భారత జట్టు అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఆసీస్ అడ్డంకిని అధిగమిస్తేనే!
ఐసీసీ టోరీ్నల్లో టైటిల్ నెగ్గలేకపోతున్న భారత జట్టు ఈసారైనా అడ్డంకులు అధిగమించి ముందడుగు వేయాలని భావిస్తోంది. 2020 టోర్నీ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్...తుది పోరులో ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తే... అందులో ఆరుసార్లు ఆస్ట్రేలియానే జట్టు విజేతగా నిలిచిందంటే ఆ జట్టు ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మరి హర్మన్ బృందం చాంపియన్‌గా నిలవాలంటే ముందుగా లీగ్ దశలో ఆసీస్‌ను ఓడించాలి. తుది పోరులోనూ ఆ జట్టుపై పైచేయి సాధించాలి.
భారత టి 20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా, రిచా ఘోష్, యస్తిక , పూజ , అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, హేమలత, ఆశ శోభన, రాధ యాదవ్, శ్రేయాంక, సజన. ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా ఛెత్రీ, తనూజ కన్వర్, సైమా ఠాకూర్.
Comments
Please login to add a commentAdd a comment