ఐసీసీ ఆఫర్‌ను తిరస్కరించిన బీసీసీఐ
వర్షాలు, వచ్చే ఏడాది వరల్డ్ కప్ ఉండటమే కారణం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టి20 ప్రపంచకప్ ఆతిథ్యానికి భారత్ తిరస్కరించింది. బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, హింసాయుత వాతావరణం వల్ల వేదిక మార్పు అనివార్యమైంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇచి్చన ఆఫర్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నో చెప్పింది. వచ్చే ఏడాది భారత్‌లో మహిళల వన్డే ప్రపంచకప్ జరగాల్సి ఉంది. దీంతో పాటు ఈ అక్టోబర్ నెల వరకు వర్షాకాలం తీవ్ర స్థాయిలో ఉంటుంది.
వరుస వరల్డ్‌కప్‌లతో పాటు, ప్రతికూల వాతావరణం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ‘మహిళల మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సిందిగా ఐసీసీ మమ్మల్ని కోరింది. అయితే ఇది సాధ్యం కాదని ఖరాఖండిగా చెప్పాం’ అని జై షా చెప్పారు. దీంతో అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగాల్సిన మెగా ఈవెంట్ కోసం ఐసీసీ ప్రత్యామ్నాయ వేదికలపై దృష్టిసారించింది.
శ్రీలంక లేదంటే యూఏఈలలో ఒక వేదికను ఈ నెల 20వ తేదీకల్లా ఖరారు చేసే అవకాశముంది. బంగ్లాలో కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలతో దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ అమ్మాయిల ప్రపంచకప్‌ను సురక్షితంగా నిర్వహించడం ఐసీసీకి క్లిష్టతరం కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఎప్పటికప్పుడు బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)తో సంప్రదింపులు జరుపుతోంది.
అక్కడి తాజా పరిస్థితులపై రోజూ సమీక్ష చేస్తోంది. బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించాల్సి ఉంది. బంగ్లా ప్రస్తుతం పాకిస్తాన్ టూర్‌లో ఉంది. అక్కడ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్ ఈ నెల 21న మొదలవుతుంది. అనంతరం వచ్చే నెల భారత పర్యటనలో రెండు టెస్టులతో పాటు మూడు మ్యాచ్‌ల టి20ల సిరీస్‌లో బంగ్లాదేశ్ పాల్గొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment