ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట అమేథీ లోక్‌సభ అభ్యర్ధి ఎవరనేది స్పష్టత రాలేదు. అయితే అభ్యర్థి ప్రకటన కోసం ఎదురు చూసి విసిగిపోయిన కార్యకర్తలు అమేథీ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో పార్టీ కార్యలయం బయట అభ్యర్ధిని ప్రకటించాలని ప్లకార్డ్‌లతో నిరసన చేపట్టారు.
అమేథీ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్మృతి ఇరానీ 4,68,514 ఓట్లు సాధించగా, రాహుల్ గాంధీ 4,13,394 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఈ సారి ఎన్నికల్లో మరోసారి తాను గెలుస్తామంటూ స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు.
అయితే కాంగ్రెస్ మాత్రం ఆ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేయలేదు. అమోథీ, వయనాడ్ ఈ రెండు స్థానాల్లో ఒకచోటే గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని, ఇద్దరూ పోటీ చేస్తారని, అమేఠీ నుంచి రాహుల్, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారని ఇలా రకరకాలుగా కాంగ్రెస్ వర్గాల నుంచి లీకులు కొనసాగుతున్నాయి.
మరో రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతుండగా.. సహనం కోల్పోయిన కార్యకర్తలు తమ లోక్‌సభ స్థానానికి అభ్యర్ధిని ప్రకటించాలని ఆందోళన చేపట్టడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment