50 Years Completed For Veteran Actor Superstar Krishna Alluri Sitaramaraju, Special Story In Telugu | Sakshi
Sakshi News home page

50 Years Of Alluri Sitaramaraju: అల్లూరికి అర్ధ శతాబ్దం

Published Wed, May 1 2024 2:11 AM | Last Updated on Wed, May 1 2024 5:58 PM

Veteran actor Krishna Alluri Sitaramaraj 50 years completes in tollywood

తొలి సినిమా స్కోప్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ చిత్రం 

రూ. రెండు కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం

జాతీయ అవార్డు తెచ్చుకున్న తొలి తెలుగు పాట‘తెలుగు వీర లేవరా...’ 

ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం 

‘మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు’.... ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ... అతను నిజమైన దొర కాదు. మన్యం దొర  అల్లూరి సీతారామ రాజు గెటప్‌ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజుని చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్‌లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. 

వెండితెరపై సీతారామరాజుగా కనిపించక ముందే అలా షూటింగ్‌ లొకేషన్లో ప్రజల చేత ‘భేష్‌’ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్‌ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికీ నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్‌ స్టార్‌. 1974 మే 1న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం... 

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్‌ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ‘జై సింహ’ని కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్‌ తర్వాతి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్‌లో స్కెచ్‌తో గీసిన ఎన్టీఆర్‌ బొమ్మ ఉంది. 

ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైనా తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్లిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్తా సినిమాలవైపు మళ్లడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజా నాట్యమండలి రాజారావు బృందం ప్రదర్శించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకానికి మంత్రముగ్దుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ ‘అసాధ్యుడు’లో (1968) అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. 

దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్‌బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి. లక్ష్మీ నారాయణ (డీఎల్‌) ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా ‘పెద్దలు మారాలి’ సినిమా తీశారు డీఎల్‌. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకి ఇచ్చి, ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా ‘అల్లూరి సీతారామరాజు’ చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. 

డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ కృష్ణ 
కృష్ణకు ‘డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌’ అని పేరు. ‘అల్లూరి సీతారామరాజు’ కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్‌ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు, పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ‘ఇంత రిస్క్‌ అవసరమా.. ఈ సినిమా వద్దు’ అని శ్రేయోభిలాషులు కృష్ణకు చె΄్పారు. 

ఎన్టీఆర్‌ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు’ శత దినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన నూరో చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబరులో మద్రాస్‌ వాహినీ స్టూడియోలో షూటింగ్‌ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న కృష్ణపై ఫస్ట్‌ షాట్‌ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి అనేక ఇబ్బందులు.

 చింతపల్లి అడవిలో షూటింగ్‌ కాబట్టి అక్కడ గెస్ట్‌ హౌస్‌లు లేకపోవడంతో యూనిట్‌లోని దాదాపు ఐదువందల మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్‌. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్‌. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్‌ఆర్‌ దాస్‌ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. 

సినిమా స్కోప్‌.. ఈజీ కాదు 
తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమా స్కోప్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అయితే అప్పుడు సినిమా స్కోప్‌ అంత ఈజీ కాదు. ఈ మూవీకి వీఎస్‌ఆర్‌ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో తీసేందుకు రెండే లెన్స్‌లు ఉండేవట. కాగా సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో తీసే లెన్స్‌కి కెమెరా వ్యూఫైండర్స్‌ ఉండవట. దీంతో ఊహించుకుని ఫ్రేమ్‌ సెట్‌ చేసుకునేవారట. ఈ ప్రక్రియను వీఎస్‌ఆర్‌ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో ‘అల్లూరి సీతారామరాజు’ ఈజీగా చేయగలిగారు.   

అల్లూరి పాటలు అజరామరం 
‘అల్లూరి సీతారామరాజు’లోని పాటలన్నీ సూపర్‌ హిట్‌. పి. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీతదర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే ‘రగిలింది విప్లవాగ్ని..’, సినిమా చివర్లో వచ్చే.. ‘ఓ విప్లవజ్యోతి...’ పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘వస్తాడు నా రాజు..’ పాటను నారాయణరెడ్డి రాయగా,  ‘హైలెస్సా.. హైలెస్సా..’, ‘కొండ దేవతా నిన్ను కొలిచేవమ్మా..’ పాటలను కొసరాజు రాశారు.

‘తెలుగు వీర లేవరా..’ పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి. రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకుగాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని ‘వందేమాతరం అంటూ నినదించిన..’, ‘హ్యాపీ క్రిస్మస్‌..’ పాట, ‘అరుణాయ శరణ్యాయ..’ శ్లోకం వంటివి కూడా వీనుల విందుగా ఉంటాయి.

రికార్డులు భళా 
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 19 కేంద్రాల్లో (బెంగళూరుతో కలుపుకుని) వందరోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్‌లోని సంగం థియేటర్‌లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగులతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని ఉడ్‌ల్యాండ్స్‌ హోటల్‌లో ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, సుంకర సత్యనారాయణ, కేఎస్‌ గోపాలకృష్ణన్‌ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రూ. పదివేలతో ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజుకి అందించారు కృష్ణ. ఇలా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి.

అల్లూరి చేయనన్న ఎన్టీఆర్‌ 
అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి, ఆపినా ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్‌ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్‌తో అన్నారు ఎన్టీఆర్‌. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి, కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్‌ కోరిక మేరకు ‘అల్లూరి సీతారామరాజు’ని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ.  ‘‘అద్భుతంగా తీశారు. నేను ‘అల్లూరి సీతారామరాజు’  తీయను’’ అన్నారు ఎన్టీఆర్‌.

మహారథి చేతికి స్క్రిప్ట్‌ 
త్రిపురనేని మహారథి చేతిలో డీఎల్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ పెట్టి, ‘ఈ సబ్జెక్ట్‌లో సినిమా తీయడానికి కావాల్సినంత దమ్ము ఉందా’ అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. ‘చాలా ఉంది’ అన్నారు మహారథి. కానీ, తనకు ఇచ్చిన స్క్రిప్ట్‌లో ఒక్క సన్నివేశం తప్ప మహారథికి వేరే ఏదీ నచ్చలేదు. పరిశోధనలు చేసి, స్క్రిప్ట్‌ తయారు చేశారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. సినిమా స్కోప్‌  ఈస్ట్‌మన్‌ కలర్‌లో తీయాలని నిర్ణయించింది పద్మాలయా స్టూడియోస్‌ సంస్థ (కృష్ణ సొంత నిర్మాణ సంస్థ). 

‘అల్లూరి...’ తర్వాత ‘పాడి పంటలు’తోనే హిట్‌... ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన  విజయా వాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక–నిర్మాత చక్రపాణి అభినందించారు. కానీ ‘ఈ సినిమా తర్వాత నీ సినిమాలు ఆడటం కష్టం’ అని కూడా కృష్ణతో అన్నారు. ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్నీ ఈ సినిమాతో పోల్చారు ప్రేక్షకులు. దాంతో ఆ తర్వాత కృష్ణ నటించిన çపది సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. చివరికి పద్మాలయా స్టూడియోస్‌ నిర్మించిన ‘పాడి పంటలు’ (1976) విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement