Sakshi News home page

ఐపీఎల్‌ "డాన్‌" విరాట్‌ కోహ్లి.. ఢిల్లీపై అత్యధికంగా..!

Published Tue, Mar 19 2024 5:45 PM

Virat Kohli Runs Against Each Team In IPL - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి టాప్‌ రన్‌ స్కోరర్‌ అన్న విషయం తెలిసిందే. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తొలి సీజన్‌ (2008) నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. ఇప్పటివరకు 237 మ్యాచ్‌లు ఆడి 7 సెంచరీలు, 50 అర్దసెంచరీల సాయంతో 130.02 స్ట్రయిక్‌రేట్‌తో 7263 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో ఎన్నో టాప్‌ రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. రాబోయే సీజన్‌లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఇవాళే (మార్చి 19) ప్రాక్టీస్‌ ప్రారంభించిన కోహ్లి చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఆర్సీబీ హోం గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో సహచరులతో కలిసి సరదాగా గడిపాడు. కోహ్లిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. కోహ్లి క్రేజ్‌కి తోడు మహిళా జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడం ఆర్సీబీ అభిమానులకు రెట్టింపు ఉత్సాహానిస్తుంది.

ఇవాళ సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌ జరుగనుండటంతో అభిమానులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. కోహ్లి నామస్మరణతో స్టేడియం మార్మోగిపోతున్నాయి. కోహ్లి ఇటీవలే రెండో బిడ్డకు తండ్రి కావడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అన్‌బాక్స్‌ ఈవెంట్‌లో ఐపీఎల్‌ ఛాం​పియన్స్‌ ఆర్సీబీ (మహిళా జట్టు) ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. మహిళా జట్టులాగే పురుషుల టీమ్‌ కూడా ఆసారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధిస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లికి సంబంధించిన గణాంకాలపై ఓ లుక్కేద్దాం. కోహ్లి ఏ జట్టుపై ఎన్ని పరుగులు సాధించాడో నెమరు వేసుకుందాం. గణాంకాల ప్రకారం కోహ్లికి ఢిల్లీ ఫ్రాంచైజీపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఫ్రాంచైజీపై కోహ్లి అత్యధికంగా 1030 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో వివిధ జట్లపై కోహ్లి సాధించిన పరుగుల వివరాలు ఇలా ఉన్నాయి.

  1. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 1030
  2. సీఎస్‌కేపై 985
  3. కేకేఆర్‌పై 861
  4. పంజాబ్‌ కింగ్స్‌పై 861
  5. ముంబై ఇండియన్స్‌పై 852
  6. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 669
  7. రాజస్థాన్‌ రాయల్స్‌పై 618
  8. డెక్కన్‌ ఛార్జర్స్‌పై 306
  9. గుజరాత్‌ లయన్స్‌పై 283
  10. కొచ్చి కేరళ టస్కర్స్‌పై 50
  11. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 117
  12. పూణే వారియర్స్‌పై 128
  13. రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్‌పై 271
  14. గుజరాత్‌ టైటాన్స్‌పై 232

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. 

Advertisement

What’s your opinion

Advertisement