Tamil Nadu Cabinet Decides to Enhance Social Security Pension to Rs 1,200 - Sakshi
Sakshi News home page

State Govt: వృద్ధాప్య పింఛన్ రూ. 1200కు పెంపు..

Published Sun, Jul 23 2023 1:40 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో వృద్ధాప్య, ఆదరణ లేని వారికి అందజేస్తున్న పింఛన్‌ మొత్తాన్ని పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం శనివారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై లబ్ధిదారులకు నెలకు రూ. 1200 పెన్షన్‌ అందజేయనున్నారు. అలాగే మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడున్న తమిళుల జాడ కోసం ఆరా తీశారు. తమిళులకు అండగా నిలబడే విధంగా ప్రత్యేక బృందాన్ని మణిపూర్‌కు పంపించేందుకు కసరత్తు చేపట్టారు.

వివరాలు.. రాష్ట్రమంత్రి వర్గం శనివారం ఉదయం సచివాలయంలో జరిగింది. సీఎం ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి దురై మురుగన్‌, పొన్ముడి, నెహ్రూ, తంగం తెన్న రసు, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, ఐ. పెరియస్వామి, ఏవీ వేలు, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామ చంద్రన్‌, ఉదయ నిధి స్టాలిన్‌, శేఖర్‌బాబు, ఎం. సుబ్రమణియన్‌, గీతా జీవన్‌ , కయల్‌ వెలి సెల్వరాజ్‌ తదితర మంత్రులు హాజరయ్యారు. సీఎస్‌ శివదాస్‌ మీన సమావేశ ముఖ్య ఉద్దేశాన్ని మంత్రులకు వివరించారు.

ఆగస్టు నుంచి..
కేబినెట్‌ సమావేశానంతరం ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్‌లో చర్చించిన కొన్ని ముఖ్య అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పలు పథకాలు అమల్లో ఉన్నాయని గుర్తు చేస్తూ, వాటి గురించి సమీక్షించామన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులు, దివ్యాంగులు, వృద్ధులు, ఆదరణ లేని వారు, వితంతువులు, భర్త వదిలి పెట్టడంతో ఒంటరిగా ఉన్న మహిళలు, 50 ఏళ్లు అవుతున్నా ఇంత వరకు వివాహం చేసుకోని వారు అంటూ పలు రకాల పింఛన్లు అందజేస్తున్నామని గుర్తుచేశారు. ఈ ఫించన్లను 1962 నుంచి అమలు చేస్తున్నామని, అప్పట్లో నెలకు రూ. 20 అందజేయగా ప్రస్తుతం రూ. 1000కు చేరినట్టు పేర్కొన్నారు.

ఇటీవల ప్రత్యేక ప్రతిభావంతులు, దివ్యాంగులకు రూ. 1000గా ఉన్న పింఛన్‌ను రూ. 500 పెంచి రూ. 1500 చేశామన్నారు. రాష్ట్రంలో 35,55,857 మంది వివిధ రకాల పింఛన్లను అందుకుంటున్నారని వివరించారు. కొత్త పెన్షన్‌ ఆగస్టు నుంచి అందజేస్తామన్నారు. ఇక ప్రత్యేక ప్రతిభావంతులకు, దివ్యాంగులకు వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచిన పింఛన్‌ పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం పింఛన్‌ కోసం 74 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వృద్ధాప్య, ఆదరణ లేని తదితర వారికి అందజేస్తున్న ఫించన్‌ను రూ. 1000 నుంచి రూ. 1200గా పెంచుతూ కెబినెట్‌లో ఆమోద ముద్ర వేసినట్లు వివరించారు.

ఈ పెంపు కారణంగా ఏడాదికి ప్రభుత్వంపై రూ. 845.91 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. కార్మికుల సంక్షేమం పరిధిలోని 1.34 లక్షల మంది భవన నిర్మాణ పరిధిలోని వారికి సైతం ఈ పింఛన్‌ పెంపు వర్తిస్తుందని ప్రకటించారు. కలైంజ్ఞర్‌ మహిళల హక్కు పథకం లబ్ధిదారుల ఎంపికలో భాగంగా సోమవారం నుంచి రాష్ట్రంలో 36 వేల శిబిరాలు నిర్వహించనున్నామన్నారు. ఈ శిబిరాలను చైన్నెలో సీఎం స్టాలిన్‌ ప్రారంభిస్తారన్నారు. ఇప్పటి వరకు 80 లక్షల మందికి దరఖాస్తులు, టోకెన్లను అందజేశామన్నారు.

పలు అంశాలపై సుదీర్ఘ చర్చ..
రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు, మంత్రులను గురి పెట్టి ఈడీ చేపడుతున్న దాడులు, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరు, మహిళకు రూ. 1000 నగదు పంపిణీ పథకం దరఖాస్తుల అందజేత, శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరు తెన్నులను సీఎం సమీక్షించినట్లు తెలిసింది. అలాగే కొత్త పరిశ్రమలకు అనుమతులు, రాష్ట్రంలోకి పెట్టుబడులు, పలు ఒప్పందాలు, తదితర అంశాల గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ప్రధానంగా మణిపూర్‌ వ్యవహారం గురించి సమీక్షించినట్టు తెలిసింది.

మణిపూర్‌లో ఇరు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో అక్కడున్న తమిళుల క్షేమం గురించి సమీక్షించారు. 10 వేల మంది తమిళులు మణిపూర్‌లో ఉన్నట్టు గుర్తించి వారి జాడ కోసం ఆరా తీశారు. అలాగే వారిని కలిసి భద్రతకు భరోసా ఇవ్వడం లేదా, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిచేందుకు వీలుగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ బృందాన్ని మణిపూర్‌కు పంపించాలని నిర్ణయించారు. అలాగే వృద్ధులకు ఆదరణ లేని వారికి, ప్రత్యేక ప్రతిభావంతులకు అందజేస్తున్న పింఛన్‌ పెంపు అంశాల గురించి సమీక్షించారు.

Advertisement
Advertisement