ఠంఛన్‌గానే పింఛన్‌ | Sakshi
Sakshi News home page

ఠంఛన్‌గానే పింఛన్‌

Published Thu, May 2 2024 5:22 AM

Disbursement of pension continued with the employees of the Secretariats

48,92,503 లబ్ధిదారులకు రూ.1,471.22 కోట్లు డీబీటీ విధానంలో జమ

మే డే సెలవైనా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ 

మరో 16,57,361 మందికి ఇళ్ల వద్దే సచివాలయాల ఉద్యోగులతో కొనసాగిన పంపిణీ 

ఇందుకోసం రూ.474.17 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

అవ్వాతాతలకు మళ్లీ చంద్రబాబు కాలం నాటి కష్టాలు 

వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయకుండా అడ్డుకున్న పచ్చమూక

సీఎం జగన్‌ మళ్లీ వస్తేనే ఇబ్బందులు తప్పుతాయని ఆకాంక్ష

సాక్షి, అమరావతి: మే 1న మేడే సందర్భంగా సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఠంచనుగా పింఛన్‌ అందించింది. 48,92,503 లబ్ధిదారులకు రూ.1,471.22 కోట్లను నేరుగా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి­గ్రస్తులు, మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన మరో 16,57,361 మందికి వారి ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.474.17 కోట్లను విడుదల చేయగా బుధవారం ఉదయం నుంచి ఆయా గ్రామ, వార్డు సచివాల­యాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పంపిణీని ప్రారంభించారు.

గత ఐదేళ్లుగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్లను అందజేసింది. అయితే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ తమ కుట్రలతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రతినెలా ఒకటినే ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును అందుకునే లబ్ధి­దారులు గత నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో అవ్వా­తాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

తమ కష్టా­లకు చంద్రబాబే కారణమని వారు మండిపడు­తున్నారు. ప్రతి నెలా 1నే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారని.. ఇప్పుడు చంద్రబాబు కుట్రలతో వలంటీర్ల సేవలకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు తమకు పచ్చమూక కుట్రలతో మళ్లీ వచ్చాయని ధ్వజమెత్తుతున్నారు.

అవ్వాతాతలకు పచ్చమూక తెచ్చిన కష్టాలు..
చంద్రబాబు, ఆయన సన్నిహితుల కుట్రలతో ఎన్ని­కల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ­సారి అవ్వాతాతలకు పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేవు. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లోనే బ్యాంకులు ఉన్నాయి. దీంతో మండల కేంద్రాలకు 10–15 కిలోమీటర్ల దూరంలో గ్రామా­ల్లో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎవరో ఒకరి సహాయం లేకుండా బ్యాంకులకు వారు వెళ్లలేరు. దీంతో ఎవరో ఒకరిని బ్యాంకు వరకు రావా­లని సహాయమడగాల్సిన పరిస్థితి. 

అంతేకా­కుండా ఇప్పుడు వేసవి కూడా కావడంతో పింఛన్ల నగదు తీసుకోవాలంటే అవ్వాతాతలు చాలా కష్టప­డాల్సి వస్తోంది. గత ఐదేళ్ల నుంచి తమ ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును నేరుగా అందుకున్న అవ్వాతాతలు బ్యాంకులకు ఎలాగోలా కష్టపడి వెళ్లినా నగదు విత్‌ డ్రా చేసుకోవడం తెలియదు. ఇందుకోసం వేరేవారిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇలా చంద్రబాబు, ఆయన ముఠా పన్నిన కుట్రలతో అవ్వాతాతలకు కష్టాలు తప్పడం లేదు.

పింఛన్‌ కోసం వెళ్లి మృత్యువాత
పింఛన్‌ కోసం అన్నమయ్య జిల్లా రాయచోటి కెనరా బ్యాంక్‌ దగ్గరికి వచ్చిన ముద్రగడ్డ సుబ్బన్న (80) బుధవారం వేసవి తాపానికి గురై కుప్ప­కూలి చనిపోయాడు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకులవరం గ్రామం పిచ్చుకగుంట్లపల్లెకు చెందిన సుబ్బన్న 1వ తేదీ కావడంతో తన పెన్షన్‌ డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయో, లేదో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అయితే మే డే కారణంగా బ్యాంకుకు సెలవు కావడంతో తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ఎండ వేడికి తాళలేక బ్యాంకు సమీపంలోనే సొమ్మసిల్లి పడిపో­యాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు నీళ్లు చల్లి మంచినీరు తాగించినా ప్రాణాలు దక్కలేదు.

పింఛను నేరుగా ఇవ్వడం లేదని మృతి
వలంటీర్ల ద్వారా నేరుగా పింఛన్‌ ఇవ్వనీయకుండా చంద్రబాబు కుట్రలు చేశారని మనస్తాపానికి గురైప ఒక వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కళ్లా వీధికి చెందిన ఖలీల్‌ బేగ్‌ (75) ప్రతి నెలా ఇంటి వద్దనే వలంటీర్‌ ద్వారా పింఛన్‌ అందుకునేవాడు. అయితే ఈసారి పింఛన్‌ బ్యాంకులో వేస్తు­న్నారని.. అక్కడి నుంచి తెచ్చుకోవాలని తెలి­య­డ­ంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవే ఆలో­చనలతో ఇంటిలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. 

చంద్రబాబు కుట్రలతో ఇబ్బందులు
నాకు వృద్ధాఫ్య పింఛన్‌ వస్తోంది. ఆధార్‌కు లింక్‌ చేసినా ఇప్పుడు నా బ్యాంక్‌ ఖాతా పని చేయడం లేదు. పింఛన్‌ వస్తుందో, లేదో అని భయంగా ఉంది. రెండు నెలల క్రితం వరకు వలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు కొట్టి పింఛన్‌ రూ. 3 వేలు చేతిలో పెట్టేవారు. చంద్రబాబు కుట్రలకు మాలాంటి ముసలోళ్లు ఇబ్బందులు పడుతున్నారు.  – గుంజి లక్ష్మీదేవి

ఇంత ఎండలో బ్యాంకుకు ఎలా వెళ్లేది?
పింఛన్‌ సొమ్మును ఈసారి బ్యాంక్‌లో వేస్తారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఎండలు మండిపో­తు­న్నాయి. బయటకు రావా­లంటేనే కష్టంగా ఉంది. ఇటువంటి పరి­స్థితుల్లో బ్యాంక్‌కు వెళ్లి పింఛన్‌ తెచ్చుకోవాలంటే నాలాంటి వృద్ధులకు ఇబ్బందే. వలంటీర్లు ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేవారు. మాలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబు వల్లే మాకీ కష్టాలు. – బొబ్బ సుందరమ్మ, ఆత్మకూరు, పల్నాడుజిల్లా  

వలంటీర్‌ ఉంటే ఉదయాన్నే పింఛన్‌..
నాకు వితంతు పింఛన్‌ వస్తోంది. మంచం మీద నుంచి పైకి లేవలేను. వలంటీర్‌ ఉన్నప్పుడు ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి పింఛన్‌ ఇచ్చేవాడు. బాబు ఓర్వలేక వలంటీర్లను అడ్డుకున్నా­రు. ఇప్పుడు పింఛన్‌ను బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు. నేను బ్యాంక్‌కు వెళ్లలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. జగనన్న వస్తే మళ్లీ కష్టాలు తీరతాయి.
– తాతపూడి రాహేలమ్మ, వెలిగండ్ల, ప్రకాశం జిల్లా 

బాబు మంచి చేయడు.. చేయనివ్వడు..
వలంటీర్ల ద్వారా మాకు వచ్చే పింఛన్లను అడ్డుకుంది చంద్రబాబే. ఆయన మంచి చేయడు.. ఎవరైనా చేస్తుంటే చేయనివ్వడు. ఐదేళ్లుగా ఇంటివద్దే పింఛన్‌ అందుకున్నాను. గత రెండు నెలలుగా చంద్రబాబు, ఆయన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేశ్‌ కుట్రలతో మాకు కష్టాలు తెచ్చిపెట్టారు. ఇప్పుడు పింఛన్‌ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. నా బ్యాంకు ఖాతా ఇప్పుడు వినియోగంలో కూడా లేదు.  – గంగాబాయి, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా 

Advertisement
Advertisement