ఎన్నదగిన తీర్పు | Sakshi
Sakshi News home page

ఎన్నదగిన తీర్పు

Published Tue, Mar 5 2024 4:30 AM

Sakshi Editorial On Supreme Court Of India verdict

చట్టసభల సభ్యులు చెట్లకూ, పుట్లకూ ప్రాతినిధ్యం వహించరు. ఓటు హక్కున్న పౌరులు వారిని ఎన్నుకుంటారు. తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపుతారు. అలా ఎన్నికైనవారి ప్రవర్తన అందరికీ ఆదర్శనీయంగా వుండాలనీ, వుంటుందనీ జనం ఆశిస్తారు. అందుకు భిన్నంగా వున్నపక్షంలో ఆ సభ్యులపై మాత్రమే కాదు... ఆ చట్టసభలపైనే ప్రజలు నమ్మకం కోల్పోతారు.

కనుకనే సోమవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది. చట్టసభల్లో ఓటేయటానికీ లేదా ప్రసంగించటానికీ లంచం తీసుకునే ప్రజాప్రతినిధులు చట్టపరమైన చర్యలనుంచి తప్పించుకోలేరంటూ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఈ ఏకగ్రీవ తీర్పు మన ప్రజాస్వామ్యానికి పట్టిన అనేకానేక చీడల్లో ఒకదాన్ని తొలగించటానికి దోహదపడుతుందని భావించాలి.

1993 సంవత్సరంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై లోక్‌సభలో వచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించటానికి అయిదుగురు జేఎంఎం సభ్యులు, జనతాదళ్‌ (ఏ) సభ్యుడొకరు లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. నాటి ప్రధాని పీవీ, ఈ ఆరుగురు సభ్యులూ ఆ తీర్మానాన్ని ఓడించటానికి ఉమ్మడిగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డా రన్నది ఆ ఆరోపణ సారాంశం.

లంచావతారాలైన ప్రభుత్వోద్యోగులు ముడుపులు తీసుకుంటే అవినీతి నిరోధక విభాగాలు అరెస్టు చేస్తాయి. వారి నేరం రుజువైన పక్షంలో శిక్ష కూడా పడుతుంది. ఇదే పని మరింత భారీ స్థాయిలో చేసే ప్రజాప్రతినిధి చట్టపరిధిలోకి ఎందుకు రారన్నది సామాన్యులకొచ్చే సందేహం. నిజానికి 1998లో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తూ తీర్పు వెలువరించినప్పుడు రాజ్యాంగ నిపుణులు నివ్వెరపోయారు. ఈ తీర్పు పార్లమెంటరీ వ్యవస్థ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుందనీ, ప్రజాస్వామ్యం పతనమవుతుందనీ హెచ్చరించారు.

నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును అర్థం చేసుకున్న తీరూ, చట్టసభల సభ్యు లకు రక్షణకల్పించే రాజ్యాంగ అధికరణ 105కు చెప్పిన భాష్యమూ లోపభూయిష్టం. పార్లమెంటు నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలూ, ఇతరత్రా ఆదేశాలకు లోబడి పార్లమెంటు సభ్యులకు వాక్‌ స్వాతంత్య్రం వుంటుందన్నది 105(1) అధికరణ చెప్పిన మాట. సభలో సభ్యులు చేసే ప్రసంగాలు, ఏదైనా అంశంపై వారు వేసే ఓటు, సమర్పించే నివేదికలు న్యాయస్థానాల్లో సవాలు చేయటానికి అతీతమైనవని 105(2) అధికరణ చెబుతోంది. కానీ వారు చేసే ప్రసంగాలూ, వేసే ఓటూ వెనక ముడుపుల ప్రమేయం వున్నప్పుడు కూడా రక్షణ పొందగలరా అన్నదే ప్రధాన ప్రశ్న.

అయితే చిత్రంగా నాటి ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన అయిదుగురు జేఎంఎం ఎంపీలకూ 105(2) అధికరణ కింద రక్షణ వుంటుందని భావించారు. అయితే అదే తరహాలో లంచం తీసుకుని కూడా ఓటింగ్‌కు గైర్హాజరైన జనతాదళ్‌(ఏ) సభ్యుడు అజిత్‌ సింగ్‌కు మాత్రం ఆ రక్షణ వర్తించదని తీర్పునిచ్చారు. నాటి ముడుపుల కేసులో ఆరోపణ లెదుర్కొన్న అయిదుగురు జేఎంఎం సభ్యుల్లో ఒకరైన శిబూ సోరెన్‌ కుమార్తె సీతా సోరెన్‌ ఎమ్మెల్యేగా వుంటూ 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్వతంత్ర సభ్యుడికి ఓటేస్తానని మాటిచ్చి ముడుపులు తీసుకున్నారు.

అయితే ఎన్నిక బహిరంగ విధానంలో జరగటంతో గత్యంతరం లేక తన పార్టీ ఎంపిక చేసిన సభ్యుడికి అనుకూలంగా ఓటేశారు. దానిపై నమోదైన కేసులో తనకు పీవీ కేసు తీర్పే వర్తిస్తుందనీ, కేసు కొట్టేయాలనీ ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ లంచం తీసుకుని కూడా అప్పట్లో ఓటింగ్‌కు గైర్హాజరైన అజిత్‌ సింగ్‌ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయమే సీతా సోరెన్‌కు కూడా వర్తిస్తుందని  హైకోర్టు భావించి ఆ పిటిషన్‌ను తోసిపుచ్చటంతో 2014లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఏదైనా కొత్త అంశం తెరపైకొచ్చినప్పుడు గత తీర్పులు నిశితమైన పరీక్షకు నిలబడక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సీతా సోరెన్‌ అప్పీల్‌ సర్వోన్నత న్యాయస్థానానికి ఆ మాదిరి అవకాశాన్ని చ్చింది. పౌరస్వేచ్ఛ పౌరులకు చట్టం ఇచ్చిన బహుమతి మాత్రమేననీ, ఆత్యయిక పరిస్థితి వున్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే హక్కు రాజ్యానికుంటుందనీ ఏడీఎం జబల్‌పూర్‌ కేసుగా ప్రసిద్ధిచెందిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువ రించింది. ధర్మాసనంలోని జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా ఒక్కరే దాంతో విభేదించారు.

ఎమర్జెన్సీ కాలంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ తీర్పును అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా వేలాదిమంది పౌరులను జైళ్లపాలు చేసింది. ఆ తీర్పును 1978లో సుప్రీంకోర్టు సవరించుకుంది. అలాగే 2017లో పుట్టస్వామి కేసులో గోప్యత హక్కుపై వెలువరించిన తీర్పు సందర్భంగా ఏడీఎం జబల్‌పూర్‌ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. తమ తీర్పు ఏ పర్యవసానాలకు దారితీస్తుందో, ఎలాంటి దుçస్సంప్రదాయాలకు సాకుగా మారుతుందో గమనించుకోవటం న్యాయస్థానాలకు తప్పనిసరి.

ప్రజాప్రతినిధులు పార్లమెంటులో వ్యవహరించే తీరుపై లంచాల ప్రభావంవున్నా వారు చర్యకు అతీతులన్న గత భావనను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చటం హర్షించదగింది. ముడుపులు ఎక్కడైనా ముడుపులే. ప్రజాప్రతినిధులు అటువంటి ప్రలోభాలకు లొంగితే వారి అనైతికత మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. చట్టసభలపై ప్రజానీకానికుండే విశ్వాసం కుప్పకూలుతుంది. అవినీతి కేసుల్లో దోషులందరికీ ఒకే చట్టం, న్యాయం వర్తిస్తుందన్న తాజా తీర్పు ఎన్నదగింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement