కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే | Sakshi
Sakshi News home page

కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే

Published Fri, May 17 2024 11:34 AM

Police Protection At Surya's Home: Here's The Reason

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ఇల్లు పోలీసుల రక్షణలో ఉంది. ఇలా రెండున్నరేళ్ల నుంచి ఆయన ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చ జరుగుతుంది. సూర్య కుటుంబం ప్రస్తుతం చెన్నైలో లేదు.. అయినా కూడా ఆ ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.

జై భీమ్‌తో వివాదం
సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి నిర్మించిన చిత్రం జై భీమ్‌. 2021లో అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదలైంది.  జైభీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపించింది. ఇరులార్ కమ్యూనిటీ (ఆదివాసీలు) సభ్యులకు కస్టోడియల్ టార్చర్ వెనుక తమ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సినిమాలో చూపించడాన్ని వారు తప్పుపట్టారు. 

సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ సంఘం తెలిపింది. 'రుద్ర వన్నియర్ సేన' సంఘానికి సూర్య  బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీ నగర్‌లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇప్పటికీ పోలీసుల రక్షణ ఎందుకు..?
జై భీమ్ సినిమా సమస్య కొన్ని నెలల తర్వాత ముగిసినప్పటికీ, సూర్య ఇంటికి గత రెండున్నరేళ్లుగా నలుగురు పోలీసులు రక్షణగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో సూర్య కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారందరూ ఇప్పుడు ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆ ఇంటికి పోలీసుల రక్షణ ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిలో, నటుడు సూర్య ఇంటికి పోలీసు రక్షణ ఎవరి ఆదేశాల మేరకు కొనసాగుతుందని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. 

పోలీస్ కమిషనర్ వివరణ
పోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు నవంబర్ 15, 2021న తాత్కాలిక భద్రత కల్పించామని, సూర్యకు ముప్పు పొంచి ఉన్నందున భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. సాధారణంగా బెదిరింపులకు గురైన వ్యక్తులకు పోలీసు రక్షణ కల్పించినప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా పోలీసు శాఖకు రుసుము చెల్లించాలి. అలా అయితే, ప్రస్తుత పోలీసు రక్షణ కోసం సూర్య ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది, దానికి సమాధానం లేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఇది ఎంతవరకు న్యాయమని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement