Train Accident: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య | Goods Train Rams Into Passenger Train Kanchenjunga Express In West Bengal Updates | Sakshi
Sakshi News home page

West Bengal Train Accident: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. అప్‌డేట్స్‌

Published Mon, Jun 17 2024 10:23 AM

West Bengal: Goods train rams into Kanchenjunga Express Updates

కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌-గూడ్స్‌ రైలు ఢీ 

రంగపాని-నిజ్బారి స్టేషన్ల మధ్య ఉదయం 9గం. ప్రాంతంలో ఘటన

ప్రమాదం ధాటికి గాల్లో లేచిన బోగీ

ప్రమాదంలో 15 మంది మృతి.. 60 మందికి తీవ్ర గాయాలు

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ఘటనా స్థలానికి సీఎం మమతా బెనర్జీ

రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై రావడంతోనే ప్రమాదం!

సిగ్నల్‌ పట్టించుకోకుండా వెళ్లిన గూడ్స్‌ రైలు?.. అధికారికంగా ప్రకటించని రైల్వే శాఖ

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని.. ఇతర ప్రముఖుల దిగ్భ్రాంతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా 15 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 60 మంది ప్రయాణికులు గాయపడినట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతుండడం.. క్షతగాత్రులకు తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.

సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. న్యూ జల్‌పాయ్‌గురి వద్ద ఓ గూడ్స్‌ రైలు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీ కొట్టింది. అస్సాం సిల్చార్‌- కోల్‌కతా సీల్దా మధ్య కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌(13174) నడుస్తుండగా.. ప్రమాదానికి కారణమైన గూడ్స్‌ అగర్తల నుంచి సీల్దా వస్తోంది. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో న్యూ జల్‌పాయ్‌గురి రంగపాని-నిజ్బారి స్టేషన్ల మధ్య గూడ్స్‌, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. 

ప్రమాదం ధాటికి రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.  ఓ బోగీ గాల్లోకి లేచింది. మూడు బోగీల్లోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదంలో గూడ్స్‌ డ్రైవర్‌, అసిస్టెంట్‌ పైలట్‌.. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ గార్డ్‌ మరణించినట్లు రైల్వే శాఖ ధృవీకరించింది. అయితే మృతుల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.

మరోవైపు ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలానికి వెళ్లారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌కడ్‌, దేశ ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు సోషల్‌ మీడియా ద్వారా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రమాదంపై రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌ ద్వారా స్పందించారు. 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఈ ప్రమాదం బాధాకరమని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారాయన. ఇంకోవైపు కేంద్రం ప్రమాదంలో మరణించిన వాళ్లకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రైల్వే శాఖ తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వాళ్లకు 2.5 లక్షలు, గాయపడిన వాల్లకు రూ.50వేలు ప్రకటించారు మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.

 

ప్రమాదం ఎలా జరిగింది?

ప్రమాదం అనంతరం ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు రావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే గూడ్స్‌ రైలు సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా క్రాస్‌ చేసి వెళ్లిపోయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే.. ప్రమాదానికి గల కారణంపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement