ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి
అఖిలపక్షం ఏర్పాటు అవశ్యం
రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్
కృష్ణలంక (విజయవాడ తూర్పు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పని చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలును సాధించటం కూడా ప్రాధాన్యతా అంశాల్లో చేర్చాలన్నారు. హోదా సాధనకు ఇదే సరైన సమయమన్నారు.
విజయవాడ గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పదేళ్లుగా బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేదని, ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకోవాల్సి ఉందన్నారు.
హోదా ముగిసిన అధ్యాయం కాదు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, అది సజీవ సమస్యగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా గురించి చర్చిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజ్యసభలో హోదాపై తీర్మానం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడాలని, దానికి ప్రతిపక్షం కూడా సానుకూలంగా స్పందించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. హోదా కోసం 2014 నుంచి పోరాటం జరుగుతోందని, చంద్రబాబు, జగన్ ఇద్దరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీ సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూగతంలో చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని, వాటిని మరోసారి కేంద్రానికి పంపించాలని కోరారు.
సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉందన్నారు. మీడియాపై అప్రకటిత నిషేధాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment