Michael Vaughan Leaves Out India As He Predicts Semi Finalists Of T20 World Cup, More Details Inside | Sakshi
Sakshi News home page

Michael Vaughan: టీమిండియాకు నో ఛాన్స్‌.. వరల్డ్‌కప్‌ సెమీస్‌కు చేరేది ఆ నాలుగు జట్లే

Published Wed, May 1 2024 3:19 PM

Michael Vaughan Leaves Out India As He Predicts Semi Finalists Of T20 World Cup

టీ20 వరల్డ్‌కప్‌ 2024 ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం​ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టోర్నీ విజేతపై క్రికెట్‌ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు తమతమ అంచనాలను, అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పలానా జట్టు జగజ్జేతగా నిలుస్తుందని కొందరంటుంటే.. ఈ ఈ జట్లు సెమీస్‌కు చేరతాయని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. 

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ కూడా చాలామంది వ్యాఖ్యాతల లాగే వరల్డ్‌కప్‌పై తన అంచనాలను వెల్లడించాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు ఈసారి సెమీఫైనల్స్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఈసారి ఫైనల్‌ ఫోర్‌కు చేరడం కష్టమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. 

వాన్‌ చెప్పిన జోస్యంపై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. వాన్‌కు టీమిండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని కొట్టిపారేస్తున్నారు. టీమిండియా లాంటి పటిష్టమైన జట్టు ఏ ప్రాతిపదిన సెమీస్‌కు చేరదో విశ్లేషించాలని సూచిస్తున్నారు. 

వరల్డ్‌కప్‌లో పాల్గొనే టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని.. సెమీస్‌కు కాదు, ఈసారి ఏకంగా టైటిలే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాపై అవాక్కులు చవాక్కులు పేలడం అలవాటుగా మార్చుకున్న వాన్‌కు తగు రీతిలో చురకలంటిస్తున్నారు. 

వాస్తవానికి ఈసారి వరల్డ్‌కప్‌ సెమీఫైనలిస్ట్‌లకు అంచనా వేయడం చాలా కష్టం. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వరల్డ్‌కప్‌లో టఫ్‌ ఫైట్‌ నెలకొంది. అన్ని జట్లు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా, అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. దీంతో ఏ జట్టు  సెమీఫైనల్‌కు చేరుతుందో చెప్పడం చాలా కష్టం. వాన్‌ లాంటి అనుభజ్ఞులైన వ్యాఖ్యాతలు అశాస్త్రియమైన అంచనాలు వేసి క్రికెట్‌ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు.

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ కోసం న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, భారత్‌, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లను ఇదివరకే ప్రకటించారు. జట్ల ప్రకటనకు ఇవాళే ఆఖరి తేదీ (మే 1) కావడంతో మరికొన్ని గంటల్లో అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించవచ్చు. 

పాకిస్తాన్‌, ఐర్లాండ్‌, కెనడా, యూఎస్‌ఏ, నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌, ఉగాండ, వెస్టిండీస్‌, పపువా న్యూ గినియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌ దేశాలు తమ వరల్డ్‌కప్‌ జట్లు ప్రకటించాల్సి ఉంది. యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ వేదికగా జూన్‌ 1 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement