మాజీ సీఎం పన్నీరుసెల్వంకు షాక్‌ | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం పన్నీరుసెల్వంకు షాక్‌

Published Sat, Aug 26 2023 12:46 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పూర్తిగా పళణిస్వామి గుప్పెట్లోకి చేరింది. ఆయన నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశ తీర్మానాలన్నీ చెల్లుతాయని శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో మాజీ సీఎం పన్నీరుసెల్వంకు షాక్‌ తప్పలేదు. పళణిస్వామి మద్దతు నేత డాక్టర్‌ సునీల్‌ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో భారీ విజయోత్సవ సందడి నెలకొంది.

కోర్టు తీర్పులు, ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పళణిస్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మదురై వేదికగా బ్రహ్మాండ మహానాడును పళణిస్వామి విజయవంతం చేశారు. అదేసమయంలో అన్నాడీఎంకేను కై వసం చేసుకుంటాననే ధీమాను మాజీ సీఎం పన్నీరుసెల్వం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు వచ్చిన తీర్పులు ఓ ఎత్తు అయితే, అన్నాడీఎంకే తీర్మానాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ తనకు అనుకూలంగానే ఉంటుందని పన్నీరు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.

తీర్మానంలోని అంశం ఇదే..
గత ఏడాది వానగరంలో పళణిస్వామి నేతృత్వంలో జూలై 11న సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో పన్నీరుసెల్వంతో పాటు ఆయన మద్దతుదారులను తొలగిస్తూ తీర్మానం చేశారు. పళణిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమను తొలగించారని సర్వసభ్య సమావేశానికి, తీర్మానాలకు వ్యతిరేకంగా పన్నీరుసెల్వం, ఆయన మద్దతుదారులు వైద్యలింగం, మనోజ్‌ పాండియన్‌, జేసీటీ ప్రభాకర్‌లు కోర్టు తలుపుతట్టారు.

సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా ఇప్పటికే హైకోర్టు, ఆతర్వాత సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. దీంతో పళణిస్వామి పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకుని ఎన్నికల ప్రక్రియ ద్వారా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు ఏకగ్రీవంగా చేపట్టారు. అయితే, తీర్మానాల వ్యవహారం సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు చేరడంతో ఈ విచారణలో తీర్పు ఉత్కంఠ తప్పలేదు. తమకు అనుకూలంగానే ఈ తీర్పు ఉంటుందని భావించిన పన్నీరుసెల్వంకు పెద్ద షాక్‌ తగిలింది.

పళణికి అనుకూలంగా తీర్పు..
పన్నీరు అండ్‌ బృందం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ పై కొన్ని నెలలుగా విచారణ జరిగింది. వాదనలు ముగిశాయి. ఇటీవల లిఖిత పూర్వక వాదనలు సైతం పళణి, పన్నీరులు వేర్వేరుగా కోర్టు ముందు ఉంచారు. శుక్రవారం న్యాయమూర్తులు ఆర్‌ మహదేవన్‌, మహ్మద్‌ షఫిక్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది. సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు చెల్లుతాయని ప్రకటించింది. పన్నీరుసెల్వం పిటిషన్‌ను తోసిపుచ్చారు. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి ఎంపికను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో పళణిస్వామి గుప్పెట్లోకి పూర్తిగా అన్నాడీఎంకే చేరినట్లైంది. అనంతరం మీడియాతో పళణిస్వామి మాట్లాడుతూ న్యాయానికి, ధర్మానికి, నిజాయితీకి దక్కిన గెలుపుగా అభివర్ణించారు. లోక్‌సభ ఎన్నికలలో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని, పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాలను కై వసంచేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

సంబరాలు...
పళణిస్వామికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. బాణసంచాలు పేల్చాయి. స్వీట్లు పంచి పెట్టి ఆనందాన్ని పంచుకున్నాయి. చైన్నె రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఎంజీఆర్‌ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ సునీల్‌ నేతృత్వంలో మద్దతుదారుల విజయోత్సవాలు జరిగాయి. దివంగత నేతలు ఎంజీఆర్‌, జయలలిత ఫ్లెక్సీలు, ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఫ్లెక్సీలను ఊరేగించారు. బాణసంచాలు పేల్చుతూ ఆనంద తాండవం చేశారు. ఈసందర్భంగా అందరికీ కొబ్బరి బొండాల పంపిణీ జరిగింది. మాజీమంత్రి జయకుమార్‌ కొబ్బరి బొండాలను అందజేశారు. పార్టీ నేతలు తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌, ఇలంగోవన్‌ పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement