రోడ్డు స్వరూపం మార్చేశారు! | Sakshi
Sakshi News home page

రోడ్డు స్వరూపం మార్చేశారు!

Published Wed, Apr 10 2024 5:47 AM

The shape of the road has changed - Sakshi

తన పాత విల్లా వెంచర్‌లోని ప్రైవేటు రోడ్డు అక్రమంగా పబ్లిక్‌ రోడ్డుగా మార్పిడి 

కొత్త వెంచర్‌కు దగ్గరి రోడ్డు మార్గం కోసం టీడీపీ నేత శివానందరెడ్డి బరితెగింపు 

సమీపంలోని నాలాపై అనుమతి లేకుండానే వంతెన సైతం నిర్మాణం 

బాధిత నివాసితుల ఫిర్యాదుతో కేసు నమోదు 

కేసు కొట్టివేత కోసం హైకోర్టుకెక్కిన శివానందరెడ్డి.. తోసిపుచ్చిన న్యాయస్థానం 

చేసేది లేక జీహెచ్‌ఎంసీకి తాను సమర్పించిన రివైజ్డ్‌ ప్లాన్‌ రద్దు చేయాలని దరఖాస్తు 

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ శివార్లలోని బుద్వేల్‌లో దళితులకు చెందాల్సిన 26 ఎకరాల భూమి కబ్జా చేశారనే కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కొత్తగా వేస్తున్న వెంచర్‌ కోసం గతంలో నిర్మించిన విల్లాల్లోని ప్రైవేటు రోడ్డు పబ్లిక్‌ రోడ్డుగా స్వరూపం మార్చేశారు. అలాగే ఓ నాలాపై అనుమతుల్లేకుండానే వంతెన నిర్మించారు.

ఈ అక్రమాలపై రామ్‌దేవ్‌గూడలోని వెస్సెల్లా మెడోస్‌ నివాసితులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదై దర్యాప్తు మొదలవడంతో దిగివచ్చిన శివానందరెడ్డి... తన తప్పులు సరిదిద్దుకొనేలా జీహెచ్‌ఎంసీకి మరో దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారం మొత్తంలో అధికారుల ఉదాశీనత, శివానందరెడ్డి లాబీయింగ్‌ స్పష్టంగా కనిపిస్తోందని వెస్సెల్లా మెడోస్‌ నివాసితులు చెబుతున్నారు. 

కొత్త వెంచర్‌కు రోడ్డు లేక... 
మాండ్ర శివానందరెడ్డి సీఈఓగా ఉన్న వెస్సెల్లా గ్రూప్‌ రామ్‌దేవ్‌గూడ ప్రధాన మార్గంలో తారామతి–బారాదరి ఎదురుగా 38 ఎకరాల్లో వెస్సల్లా మెడోస్‌ పేరుతో 295 త్రీ, ఫోర్, ఫైవ్‌ బీహెచ్‌కే విల్లాలు నిర్మించడానికి 2017లో జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకుంది. అప్పట్లో ఈ విల్లాస్‌ లోపల రెండు అంతర్గత ప్రైవేటురోడ్లు ఉండేలా రూపొందించిన ప్లాన్‌కే అధికారులు అనుమతి ఇచ్చారు.

కొన్నాళ్ల క్రితం వెస్సెల్లా గ్రూప్‌ పాత వెంచర్‌కు వెనుక వైపు నాలా పక్కన మరో 9 ఎకరాల్లో మరో వెంచర్‌ మొదలుపెట్టింది. ప్రధాన రహదారి నుంచి ఈ వెంచర్‌కు చేరుకోవాలంటే సమీప మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే శివానందరెడ్డి మరో కుట్రకు తెరలేపారు. వెస్సెల్లా మెడోస్‌లో ఉన్న రెండు ప్రైవేట్‌ రహదారుల్లో ఒకదాన్ని పబ్లిక్‌ రోడ్డుగా అక్రమంగా మార్చేశారు.

ఈ మేరకు రివైజ్డ్‌ ప్లాన్‌తో 2022లో జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఆమోదించడంతో వెస్సెల్లా మెడోస్‌లోని ప్రైవేట్‌ రోడ్డు పబ్లిక్‌ రోడ్డుగా మారిపోయి వెనుక ఉన్న 9 ఎకరాల వెంచర్‌ను ప్రధాన రహదారికి దగ్గర చేసింది. ఈ రెండు వెంచర్ల మధ్య ఓ నాలా ఉండటంతో ఇరిగేషన్‌ విభాగం సహా ఎవరి అనుమతి లేకుండానే ఆయన దానిపై వంతెన నిర్మించారు. 

బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి.. 
వెస్సెల్లా మెడోస్‌ శాంక్షన్డ్‌ ప్లాన్‌కు విరుద్ధంగా తమ ప్రైవేటు రోడ్డును పబ్లిక్‌ రోడ్డుగా శివానందరెడ్డి మార్చేసినట్లు నివాసితులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలిసింది. దీంతో 6 విల్లాలకు చెందిన యజమానులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఐపీసీలోని 420, 406 సెక్షన్ల కింద అదే నెల 8న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసు నమోదు కాకుండా చూసేందుకు శతవిధాలా శివానందరెడ్డి ప్రయత్నించినప్పటికీ ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదై దర్యాప్తు ప్రారంభం కావడంతో ఆయన హైకోర్డును ఆశ్రయించి క్వాష్‌ పిటిషన్‌ వేశారు. తనపై కేసు కొట్టేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించని న్యాయస్థానం... నిందితులకు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించి కేసు దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది.

దీంతో గత్యంతరం లేక శివానందరెడ్డి వెస్సెల్లా మెడోస్‌కు సంబంధించి తాను సమర్పించిన రివైజ్డ్‌ ప్లాన్‌ను రద్దు చేయాలంటూ జీహెచ్‌ఎంసీకి మరో దరఖాస్తు సమర్పించినట్లు తెలిసింది. కాగా, జీహెచ్‌ఎంసీ అధికారులను మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ కేసులో శివానందరెడ్డిపై పోలీసులు అదనపు సెక్షన్లు జోడించాలని వెస్సెల్లా మెడోస్‌ నివాసితుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement