భువనగిరి ఖిల్లా ఎవరిదో! | Sakshi
Sakshi News home page

భువనగిరి ఖిల్లా ఎవరిదో!

Published Sun, May 12 2024 12:30 PM

భువనగిరి ఖిల్లా ఎవరిదో!

ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌లో పోటీ త్రిముఖం

ఇబ్రహీంపట్నం: లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నాలుగైదు రోజులుగా ఎన్నికల ప్రచారంతో పల్లె, పట్టణం, ఊరు వాడ హోరెత్తింది. బైక్‌ ర్యాలీలు, మైక్‌ సౌండ్‌ రికార్డులు, కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్డు షోలు ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీ శ్రేణులు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజవర్గం భువనగిరి లోక్‌సభ పరిధిలో ఉంటుంది. కాంగ్రెస్‌ నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, బీఆర్‌ఎస్‌ నుంచి క్యామ మల్లేశ్‌, సీపీఎం నుంచి ఎండీ జహంగీర్‌ ప్రధాన పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌ బీఆర్‌ఎస్‌ నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒకింత ఉత్సాహం నింపింది. ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా మల్‌రెడ్డి రంగారెడ్డి ఉండటం, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో చేపట్టడం కాంగ్రెస్‌కు కలిసోచ్చే అంశం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతోపాటు చేయబోయే ఆరు గ్యారంటీల గురించి ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ప్రచారం చేశారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న బూర నర్సయ్యగౌడ్‌ గతంలో ఎంపీగా పనిచేయడంతో ఇక్కడి ప్రజలకు సుపరిచితులు. అప్పట్లో ఆయన చేసిన పనులతోపాటు ప్రధాని మోదీ దేశ ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకున్నారు. మోదీ చరిష్మాతోనే విజయం సాధిస్తామనే ధీమాలో బీజేపీ శ్రేణులున్నాయి. ఈ నియోజకర్గం పరిధిలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొని ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కంటే లోక్‌సభ అభ్యర్థుల ప్రచారం మొదట్లో మందకొడిగా సాగిన చివరి దశలో ఊపందుకుంది. సోమవారం పోలింగ్‌, జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపుతో నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారో స్పష్టం కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement