ఓటర్లకు ధన్యవాదాలు | Sakshi
Sakshi News home page

ఓటర్లకు ధన్యవాదాలు

Published Wed, May 15 2024 9:50 AM

ఓటర్ల

కడప కార్పొరేషన్‌: ప్రజల బాధ్యతాయుత కర్తవ్య దీక్షతో, కార్యకర్తల, పార్టీ నాయకుల సహకారంతో, దేవుని దయతో ఈ ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా ము గిసిందని ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎస్‌బీ అంజద్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేస్తూ, ప్రతి విషయంలోనూ వెన్నంటి ఉంటూ, బాధ్యతగా, నమ్మకంగా తనతో కలిసి నడిచి, తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

24న గోవాకు ప్రత్యేక బస్సు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ కడప డిపో నుంచి ఈనెల 24వ తేది గోవాకు ప్రత్యేక ఇంద్ర ఏసీ బస్సు సర్వీసు (50301)ను నడపనున్నట్లు కడప డిపో మేనేజర్‌ డిల్లీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు సర్వీసులో చార్జీ పెద్దలకు రూ.3300 (రానూపోను), పిల్లలకు రూ. 2000లుగా నిర్ణయించారని పేర్కొన్నారు. బస్సు 24వ తేది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కడపలో బయలుదేరి 25వ తేది శని వారం ఉదయం 9 గంటలకు గోవాకు చేరు తుంది. అలాగే తిరిగి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గోవాలో బయలుదేరి.. సోమవారం ఉదయం 10 గంటలకు కడపకు చేరుతుందని వివరించారు. ఈ బస్సు సర్వీసు కు సంబంధించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్‌.ఇన్‌ లేదా కడప ఆర్టీసీ బస్టాండులోని రిజర్వేషన్‌ కౌంటర్‌ ద్వారా టిక్కెట్లను పొందవచ్చన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాలీలో ఉచిత శిక్షణ

కడప కోటిరెడ్డిసర్కిల్‌: ఉన్నతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ అడ్మిషన్స్‌ కో–ఆర్డినేటర్‌ హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్‌ పాస్‌, ఇంటర్మీడియేట్‌, డిప్లొమా, డిగ్రీ పాస్‌/ఫెయిల్‌ అయి 18–26 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు. 35 రోజులపాటు కొనసాగే శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ట్యాలీ శిక్షణతోపాటు కంప్యూటర్‌ స్కిల్స్‌, స్పోకన్‌ ఇంగ్లీషు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లైఫ్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌, వర్క్‌ప్లేస్‌ ఎథిక్స్‌లో శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణానంతరం ప్రతిభను బట్టి ఉపాధి కల్పిస్తామని, ఇతర వివరాలకు 90004 87423 నెంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.

23న దేవరరాయి

నల్లగంగమ్మ తిరునాల

సంబేపల్లె: మండల పరిధిలోని శ్రీ దేవరరాయి నల్లగంగమ్మతల్లి జాతర ఈనెల 23వ తేదీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు వాహనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కొందరు పార్టీకి

ద్రోహం చేశారు!

కడప రూరల్‌: కడప శాసన సభ ఎన్నికల్లో కొంతమంది టీడీపీ నేతలు.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని.. అటువంటి వారిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పినప్పటికీ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. అలాంటి వారి పై పార్టీ అధిష్టానం క్రమ శిక్షణా చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ కడప ఎమ్మెల్యే అభ్యర్ధి మాధవిరెడ్డి పాల్గొన్నారు.

17న జిల్లాస్థాయి

మహిళల క్రికెట్‌ ఎంపికలు

కడప స్పోర్ట్స్‌: కడప నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలోని నెట్స్‌ కేంద్రంలో ఈనెల 17వ తేదీ ఉదయం 7 గంటలకు జిల్లాస్థాయి అండర్‌–23, అండర్‌–19, అండర్‌–15 మహిళల విభాగం క్రికెట్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ వైఎస్‌ఆర్‌ డిస్ట్రిక్ట్‌ (సీఏవైడీ) కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్‌ తెలిపారు. అండర్‌–23 విభాగంలో పాల్గొనే క్రీడాకారిణులు 01–09–2001 తర్వాత పుట్టినవారై ఉండాలని పేర్కొన్నారు. అండర్‌–19 విభాగానికి 01–09–2005 తర్వాత, అండర్‌–15 విభాగానికి 01–09–2009 తర్వాత పుట్టినవారై ఉండాలని సూచించారు. ఆసక్తి గల క్రీడాకారిణులు ఆధార్‌కార్డు, బర్త్‌సర్టిఫికెట్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, స్టడీసర్టిఫికెట్‌, పదోతరగతి మార్కులిస్టులన ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఒకసెట్‌ జిరాక్స్‌ ప్రతులను తీసుకురావాలని సూచించారు. క్రికెట్‌ కిట్‌ బ్యాగులు వెంట తెచ్చుకోవాలని కోరారు.

ఓటర్లకు ధన్యవాదాలు
1/1

ఓటర్లకు ధన్యవాదాలు

Advertisement
 
Advertisement
 
Advertisement