దేశంలో మొదటి స్పేస్‌ఫైబర్‌ ఇంటర్నెట్‌ను ప్రారంభించిన జియో | Sakshi
Sakshi News home page

దేశంలో మొదటి స్పేస్‌ఫైబర్‌ ఇంటర్నెట్‌ను ప్రారంభించిన జియో

Published Fri, Oct 27 2023 1:12 PM

Jio Launched The First Gigafiber Internet In The Country - Sakshi

న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023’ ప్రారంభం సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ స్పేస్‌ఫైబర్‌ను ఆవిష్కరించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటి  శాటిలైట్‌ గిగాఫైబర్ సేవల ద్వారా వినియోగదారులకు మరింత వేగంగా ఇంటర్నెట్‌ అందే అవకాశం ఉందని సంస్థ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు.

లక్షలాది కుటుంబాలు, వ్యాపారాలు మొదటిసారిగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను అనుభవించే అవకాశాన్ని జియో కల్పించిందన్నారు. జియో స్పేస్‌ఫైబర్‌తో ఇంకా కొన్ని ఇంటర్నెట్‌ అందని ప్రాంతాలకు సేవలందించే వెసులుబాటు ఉంటుదన్నారు. జియోస్పేస్‌ఫైబర్‌తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా గిగాబిట్‌ యాక్సెస్‌తో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చని ఆయన చెప్పారు.

రిలయన్స్‌ జియో ఇప్పటికే భారత్‌లో 45 కోట్ల కస్టమర్లకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్‌ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్‌, జియోఎయిర్‌ఫైబర్‌ వంటి సర్వీసుల సరసన జియోస్పేస్‌ఫైబర్‌ను చేర్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. తాజా శాటిలైట్‌ నెట్‌వర్క్‌తో జియో ట్రూ5జీ సేవలు సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని కంపెనీ తెలిపింది.

ప్రపంచంలో శాటిలైట్‌ టెక్నాలజీ(మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌-ఎంఈఓ) కోసం జియో ఎస్‌ఈఎస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జియో తెలిపింది. గిగాబిట్‌, స్పేస్‌ నుంచి ఫైబర్‌ తరహా సేవలను అందించగల ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత కచ్చితత్వంతో ఈ అత్యాధునిక సాంకేతితతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది.

జియోస్పేస్‌ఫైబర్‌ ఇప్పటికే గుజరాత్‌ గిర్‌, ఛత్తీస్‌గఢ్‌ కోర్బా, ఒడిశా నవరంగాపూర్‌, అసోం ఓఎన్‌జీసీ జోర్హట్‌ వంటి మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తుంది.

Advertisement
Advertisement