మూడో దశలో 63.53% పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

మూడో దశలో 63.53% పోలింగ్‌

Published Wed, May 8 2024 3:36 AM

2024 Lok Sabha elections: More than 63 percent polling in third phase

స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్‌ 

11 రాష్ట్రాలు, యూటీల్లోని 93 స్థానాలకు పూర్తయిన పోలింగ్‌

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల మూడో దశలో 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మంగళవారం రాత్రి 10 గంటల వరకు 63.53 శాతం పోలింగ్‌ నమోదైంది. పశ్చిమబెంగాల్‌లో జరిగిన స్వల్ప ఘర్షణలు, చెదురుముదురు ఘటనలు మినహా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నిరీ్ణత పోలింగ్‌ సమయం సాయంత్రం ఆరులోపు క్యూ లైన్లలో నిల్చున్న వారినీ ఓటేసేందుకు అనుమతించారు.

దాంతో పోలింగ్‌ శాతం పెరిగే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అస్సాంలో అత్యధికంగా 79.79 శాతం, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 57.34 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కాస్తంత మెరుగ్గా 57.62 శాతం పోలింగ్‌ నమోదవడం గమనార్హం. పశ్చిమబెంగాల్‌లో పోలింగ్‌బూత్‌ వద్ద ఘర్షణలు, ఓటర్లను మభ్యపెట్టడం, బూత్‌ ఏజెంట్లపై దాడులపై టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్‌–సీపీఐ(ఎం)లు విడివిడిగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నాయి.

ముర్షీదాబాద్, జాంగీపూర్‌ స్థానాల నుంచి ఈసీకి ఉదయం 9లోపే 180కిపైగా ఫిర్యాదులందాయి. కొన్ని చోట్ల టీఎంసీ, సీపీఎం కార్యకర్తలు ఘర్షణకు దిగారు. గుజరాత్‌లోని బనస్కాంతా నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లలా వచ్చి పోలింగ్‌బూత్‌ వద్ద ఓటర్లను మభ్యపెట్టారన్న ఉదంతంలో కలెక్టర్‌ దర్యాప్తునకు ఆదేశించారు. 

గుజరాత్‌లో ఓటేసిన ప్రధాని మోదీ 
సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని మోదీ ఓటేశారు. గాం«దీనగర్‌ నియోజకవర్గంలోని అహ్మదాబాద్‌ నగరంలో ఉన్న నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రధాని మోదీ ఓటేశారు. గాం«దీనగర్‌ బీజేపీ అభ్యరి్థ, కేంద్ర మంత్రి అమిత్‌ షా పోలింగ్‌ బూత్‌ వద్ద మోదీకి స్వాగతం పలికారు. ఇదే పోలింగ్‌బూత్‌లో ఓటు ఉండటంతో మోదీ అన్నయ్య సోమాభాయ్‌ మోదీ సైతం అక్కడికొచ్చారు. దీంతో ఆయన ఆశీర్వాదం తీసుకునే మోదీ ఓటేశారు. 

ఉదయాన్నే ఓటేసేందుకు వచ్చిన ప్రధానిని కలిసేందుకు ఓటర్లు ఎగబడ్డారు. అమిత్‌ షా సైతం ఇదే అహ్మదాబాద్‌లో మరో చోట ఓటేశారు. ‘ అన్ని నియోజకవర్గాల్లో వయోబేధంలేకుండా ఓటర్లంతా ఎన్‌డీఏ, అభివృద్ధి అజెండాపై నమ్మకం ఉంచారు. ఇండియా కూటమి వేగంగా నీరుగారిపోతోంది. ఓటుబ్యాంక్‌ రాజకీయాలకు స్వస్తిపలికి ఆర్థికాభివృద్ధికి జై కొట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు’ అని ఓటేశాక మోదీ ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు.  

282 స్థానాల్లో పోలింగ్‌ పూర్తి 
అమిత్‌ షా( గాంధీనగర్‌), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్‌సుఖ్‌మాండవీయ(పోర్‌బందర్‌), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్‌), ప్రహ్లాద్‌ జోషి(ధార్వాడ్‌), ఎస్పీసింగ్‌ బఘేల్‌(ఆగ్రా) పోటీచేస్తున్న స్థానాల్లోనూ మంగళవారం పోలింగ్‌ పూర్తయింది. గుజరాత్‌లోని సూరత్‌ను బీజేపీ ఏకగ్రీవంగా గెల్చుకోవడంతో మిగతా 25 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరిగింది. 

కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 7, బిహార్‌లో 5, అస్సాం, పశ్చిమబెంగాల్‌లో చెరో 4, గోవాలో 2, దాద్రానగర్‌ హవేలీ, డయ్యూ డామన్‌లో రెండు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. మంగళవారం పోలింగ్‌ జరిగిన గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని మెజారిటీ స్థానాలను 2019లో బీజేపీ కైవసం చేసుకుంది. మూడో దశ పోలింగ్‌ ముగియడంతో మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా 282 స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది. తొలి దశలో 66.14 శాతం, రెండో దశలో 66.71 శాతం పోలింగ్‌ నమోదైంది.

రాష్ట్రం          పోలింగ్‌ శాతం 
గుజరాత్‌       57.62 
కర్ణాటక         70.03
మహారాష్ట్ర    61.44 
ఉత్తరప్రదేశ్‌  57.34 
మధ్యప్రదేశ్‌  66.05
ఛత్తీస్‌గఢ్‌      70.05 
బిహార్‌           58.16 
అస్సాం        79.79 
బెంగాల్‌       73.96 
గోవా            75.13 
దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్‌    68.89

 
Advertisement
 
Advertisement