Sakshi News home page

RIL: 29.7 శాతం పెరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభం

Published Sat, Oct 28 2023 1:34 PM

Reliance Industries Profit Increased By 30 Percent - Sakshi

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 29.7 శాతం పెరిగింది. దాంతో రూ.19,878 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తోపాటు జియో, రిటైల్ వ్యాపారం మంచి పనితీరు కారణంగా కంపెనీ లాభాల్లో పయనిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ స్థూల ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.2,55,996 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్‌ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్‌లు సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 12 శాతం పెరిగి రూ.5,297 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,729 కోట్లుగా ఉంది. కొత్తగా చేరే సబ్‌స్క్రైబర్ బేస్‌లో 7.5 శాతం పెరుగుదల నమోదైంది.

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఆదాయం 18.8 శాతం పెరిగి రూ.77,148 కోట్లుగా నిలిచింది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 1.75 శాతం పెరిగి రూ.2,265.25 వద్ద స్థిరపడింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్  అంబానీ మాట్లాడుతూ..డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా వేగంగా 5జీ సేవలు విస్తరిస్తామన్నారు. రిలయన్స్ రిటైల్ విస్తరణను కొనసాగిస్తామని చెప్పారు. ఇంధన మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ ఆయిల్‌2కెమికల్‌ విభాగానికి డిమాండ్‌ పెరిగిందన్నారు. 
 

Advertisement
Advertisement