రష్యాలో ఎన్నికల తంతు! | Sakshi
Sakshi News home page

రష్యాలో ఎన్నికల తంతు!

Published Sat, Mar 16 2024 2:59 AM

Putin set to sweep in Russian Presidential Election  - Sakshi

ఆపద్ధర్మ ఏలుబడితో కలుపుకొని ప్రధానిగా, దేశాధ్యక్షుడిగా పాతికేళ్లనుంచి అవిచ్ఛిన్నంగా రష్యా అధికార పీఠాన్ని అంటిపెట్టుకునివున్న వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి సార్వత్రిక ఎన్నికల తంతుకు తెరలేపారు. మూడురోజులపాటు జరిగే ఈ ఎన్నికలు శుక్రవారం మొదలయ్యాయి. 14 కోట్ల 30 లక్షలమంది జనాభాగల రష్యాతోపాటు 2014లో అది దురాక్రమించిన క్రిమియా... 2022 నుంచీ దాని ఆక్రమణలోవున్న ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికలు జరుగుతాయి.

ప్రభుత్వ మీడియా మినహా మరి దేనికీ చోటీయని రష్యాలో చిన్నపాటి అసమ్మతి వినిపించే ప్రయత్నం చేసినా పెద్ద నేరమవుతుంది. అందుకే ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలన్నీ పుతిన్‌కు 80 శాతం ప్రజల ఆమోదం వున్నదని చాటాయి. కనుక 71 యేళ్ల పుతిన్‌ మరోసారి విజయం సాధించి అయిదోసారి అధ్యక్షుడవుతారనీ, 2030 వరకూ ఆయనే పాలిస్తారనీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయని చెప్పటానికి నామమాత్రంగా ప్రత్యర్థులు కనబడతారు. కానీ వారెవరికీ ప్రజల్లో విశ్వసనీయత లేదు.

ఒకప్పుడు దశాబ్దాలపాటు దేశాన్నేలిన కమ్యూనిస్టు పార్టీ ఏనాడో నామ మాత్రావశిష్టమైంది. ఆ పార్టీ తరఫున 75 యేళ్ల నికొలాయ్‌ ఖరిటోనోవ్‌ పోటీచేస్తున్నారు. 2004లో పుతిన్‌పై మొదటిసారి ఓడిన ఆయన్నే ఈసారి కూడా ఆ పార్టీ నిలబెట్టింది. ఎటూ గెలవని ఎన్నికల కోసం మరొకరిని ముందుకు తోయటం అనవసరమని ఆ పార్టీ భావించివుండొచ్చు. లిబరల్‌ డెమొ క్రాటిక్‌ పార్టీ అభ్యర్థి లియోనెడ్‌ స్లట్‌స్కీ... పుతిన్‌ మాదిరే జాతీయవాది. ఆయన గెలుపే తన గెలు పని స్లట్‌స్కీ ఇప్పటికే ప్రకటించారు. ఉదారవాదిగా ముద్రపడి ఉక్రెయిన్‌లో ‘శాంతి’ నెలకొనాలని తరచు చెప్పే న్యూ పీపుల్‌ పార్టీ అధినేత వ్లాడిస్లావ్‌ దవాన్‌కోవ్‌ది కూడా అదే తీరు. ఇక ఉక్రెయిన్‌తో తలపడటాన్ని తప్పుబట్టిన చరిత్రగల ఇద్దరు అభ్యర్థులను అధికారులు ‘అనర్హులుగా’ తేల్చారు. 

చాలా దేశాలకు ఇది ఎన్నికల నామ సంవత్సరం. ఇప్పటికే బంగ్లాదేశ్, తైవాన్‌ ఎన్నికలుపూర్తయ్యాయి. మన దేశంతోపాటు అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఇండొనేసియా తదితర 60 దేశాల్లో ఈ ఏడాదంతా వేర్వేరు నెలల్లో ఎన్నికలుంటాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 200 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంటే ప్రపంచ జనాభాలో నాలుగోవంతన్నమాట! అయితే విజేతలై గద్దెనెక్కేవారు ప్రజాస్వామ్యబద్ధంగానే పాలిస్తారా అన్నది వేరే సంగతి. ఎందుకంటే ప్రజా స్వామ్యం ముసుగేసుకున్న నియంతలూ, సమాజంలో పరస్పర వైషమ్యాలు రెచ్చగొట్టే నేతలూ, గాలి కబుర్లతో గద్దెనెక్కాలనుకునేవారూ ఈ దేశాలన్నిటా వున్నారు. కానీ పుతిన్‌ మాదిరి బరితెగించిన నేత ఎక్కడా కనబడరు.

క్రితంసారి ఎన్నికలకన్నా ఎక్కువ పోలింగ్‌ అయిందనీ, పుతిన్‌కు అధిక శాతం మద్దతు లభించిందనీ ‘నిరూపించటానికి’ అధికారగణం ఎక్కడలేని పాట్లూ పడుతూవుంటుంది. 2018 ఎన్నికల సమయంలో పోలైన ఓట్లలో పుతిన్‌కు 5 కోట్ల 60 లక్షల ఓట్లులభించాయి. కనుక ఈసారి అది ఆరు కోట్లు దాటాలన్నది వారి పట్టుదల. తమ అధీనంలోని ఉక్రెయిన్‌ భూభాగంలో 45 లక్షలమంది ఓటర్లున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ నిత్యం బాంబుల వర్షం కురిసేచోట నిజానిజాలు నిర్ధారించేదెవరు? వారందరికీ ఆన్‌లైన్‌ వోటింగ్‌కు అవకాశం ఇచ్చామని అధికారులు ప్రకటించారు.

కనుక రిగ్గింగ్‌ ఈసారి పాత రికార్డులు బద్దలుకొడుతుందని నిర్ధారణగా చెప్పవచ్చు. వారం పదిరోజుల్లో ఉక్రెయిన్‌ లెక్క తేల్చి, యుద్ధ విజేతగా చాటుకుని అధ్యక్ష ఎన్నికలకు వెళ్లాలని పుతిన్‌ తపించారు. కానీ 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన నాటి నుంచీ రష్యాకు అడుగడుగునా అవరోధాలే. అమెరికా ఉక్రెయిన్‌కు భారీయెత్తున సైనిక, ఆర్థిక సాయం అందించటమే కాదు...‘ఉక్రెయిన్‌ తర్వాత మీవంతే’ అని నాటో కూటమి దేశాలను బెదరగొట్టి ఆ దేశం పక్షాన నిలబడేలా చేసింది. కనుక యుద్ధం రెండేళ్లుదాటి మూడోసంవత్సరంలోకి ప్రవేశించినా పుతిన్‌కు అక్కడ దారీ తెన్నూ కనబడటం లేదు. పైపెచ్చు ఆయుద్ధంలో రష్యా సైనికులు భారీ యెత్తున మరణిస్తుండటం, అత్యాధునిక ఆయుధాలు అక్కరకు రాకుండా పోవటం, ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులను నిలువరించటంలో వైఫల్యం వంటివి ఆయనకు నిరాశ కలిగిస్తున్నాయి. కానీ ఆ యుద్ధం వల్ల పుతిన్‌కు జనాల్లో ఆమోదనీయత పెరిగిందని ప్రభుత్వ మీడియా ఊదరగొడుతోంది. 

అయితే పుతిన్‌ ఏలుబడి నల్లేరు మీద నడక కాదు. 2006–08 మొదలుకొని రెండేళ్లనాడు మొదలైన ఉక్రెయిన్‌ దురాక్రమణ యుద్ధం వరకూ ఏదో పేరిట చెలరేగే నిరసనలు తలనొప్పిగానే వున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా, హక్కుల ఉల్లంఘన, దురాక్రమణ యుద్ధాలను నిరసిస్తూ ఈ ఉద్యమాలు సాగాయి. అయితే పుతిన్‌ వాటన్నిటినీ అణిచేసి, జైళ్లు నింపారు. ప్రస్తుతం రాజకీయ ఖైదీల సంఖ్య 1,16,000 పైమాటే. దేశ పౌరుల్లో పుతిన్‌ పాలనపై తీవ్ర అసంతృప్తి వుంది. ప్రభుత్వ వ్యయంలో 40 శాతం యుద్ధానికే కేటాయించాల్సివస్తోంది. అయినా ఫలితం నాస్తి. నిరుడు జీడీపీ 3.6 శాతంగా నమోదై జీ–7 దేశాలను అధిగమించింది.

రక్షణరంగ పరిశ్రమలు మాత్రమే పచ్చగా వర్ధిల్లుతున్నాయి. అమెరికా ఆంక్షల పర్యవసానంగా దేశంలో అనేక వ్యాపార ‡సంస్థలు కుప్పకూలి మూతబడ్డాయి. వాస్తవాదాయాలు పడిపోయి, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి పౌరులు సతమతమవుతున్నారు. దానికితోడు అంతర్జాతీయంగా ఏకాకులమయ్యామన్న అసంతృప్తి అదనం. కానీ అధ్యక్ష ఎన్నికల్లో వీటి ప్రభావం కనబడనీయకపోవటం పుతిన్‌ ప్రత్యేకత. ఈ రీతి, రివాజు ఎన్నాళ్లు కొనసాగుతుందో, నిజమైన ప్రజాస్వామ్యం రష్యాలో ఎప్పుడు చిగురిస్తుందో చూడాలి.  

Advertisement
Advertisement