విలువల్లోనూ పట్టువిడుపులు! | Sakshi
Sakshi News home page

విలువల్లోనూ పట్టువిడుపులు!

Published Mon, Jun 5 2023 3:21 AM

Sakshi Guest Column On Atal Bihari Vajpayee

వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు అభిషేక్‌ చౌధరి. అటల్‌ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్‌పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటారాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్‌ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేక పోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టుకోవాలా? ‘మహాత్ముడి మరణాన్ని అటల్‌ అస్సలేమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు’ అని చౌధరి రాశారు. అయితే యౌవనానంతర దశలో పరిణతి కలిగిన నాయకుడిగా తన పూర్వపు ధోరణికి భిన్నంగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి మారిపోయారు.

అటల్‌ బిహారీ వాజ్‌పేయి గురించి మనకు తెలుసనే అనుకుంటాం. నిజంగానే మనకు తెలుసా? ఎందరికో ఆయన ఆరాధ్యులు. చాలామందికి ఆయనొక మంచి ప్రధాని కూడా. ఇక ఆయన వాగ్ధాటికైతే మంత్రముగ్ధులు కానివాళ్లెవరు! అయిన ప్పటికీ, ఆయనేమిటో పూర్తిగా మనకు తెలుసా? వాజ్‌పేయి ఛాయ వెనుక ఉన్న వాజ్‌పేయి గురించి మనకు తెలుసా?

ఇటీవల విడుదలైన వాజ్‌పేయి జీవిత చరిత్రలో మనకు తెలి యని, మనం ఊహించని ఎన్నో అంశాలు ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఆయన గురించి కచ్చితమైనవిగా మనం ఇప్పటివరకూ భావిస్తూ వస్తున్న కొన్ని కథనాలకు రుజువులు లేవని ఆ పుస్తకం ద్వారా తెలుస్తుంది. సంప్రదాయబద్ధం కాని వాజ్‌పేయి వ్యక్తిగత జీవితాన్ని కూడా పుస్తకం స్పృశించింది.

ఆయనను బాగా ఎరిగిన వాళ్లు సైతం వాజ్‌పేయిలోని ఈ అసంప్రదాయపరత్వాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. తాజాగా అభిషేక్‌ చౌధరి రాసిన ‘వాజ్‌పేయి: ది అసెంట్‌ ఆఫ్‌ ది హిందూ రైట్‌ 1924–1977’ అనే పుస్తకంలోని విశేషాలు ఇవన్నీ. రెండు సంపుటాల ప్రయత్నంలోని మొదటి భాగం ఇది. రెండో భాగం డిసెంబరులో రానుంది.

వాజ్‌పేయి ఆహార ప్రియులనీ, విలాసజీవుడనీ మనం విన్నాం. ‘భంగ్‌ ఆయనకు ప్రీతికరమైనది. తగు మోతాదుల్లో సేవించేవారు’. ‘చైనా వంటల్ని అదే తన జీవితేచ్ఛ అన్నట్లుగా ఆరగించేవారు’. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు రాత్రి క్లబ్బులు ఆయన్ని రంజింప జేశాయి. ఆ అనధికార సందర్శనలలో ఒకటీ అరా పెగ్గులు మనసారా గ్రోలేవారు.

చౌధరి అనడం అటల్‌ తన యౌవనంలో ముస్లిం వ్యతిరేకి అని.  ‘జీవిక కోసం భారతదేశాన్ని ఎంపిక చేసుకున్న ముస్లింలను దేశ ద్రోహులుగానే చూడాలని అటల్‌ వాదించేవారు’ అని రాశారు. అటల్‌ ‘రాష్ట్రధర్మ’ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ముస్లింలను ‘ఫిప్త్‌ కాలమిస్ట్‌లు’ (ఆశ్రయమిచ్చిన దేశంలో ఉంటూనే ఆ దేశానికి వ్యతి రేకంగా పోరాడేవారు) అని పేర్కొన్నారు. యౌవనానంతర దశలో మాత్రం తన పూర్వపు ధోరణికి పూర్తి భిన్నంగా ఆయన మారి పోయారు. అది నిజం. ఆ మార్పు ఎంత గొప్పదో చెప్పే వెల్లడింపులు కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. 

మహాత్మా గాంధీ పట్ల వాజ్‌పేయి వైఖరిని గురించి చెబుతూ, ‘మహాత్ముడి మరణాన్ని అటల్‌ అస్సలు ఏమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు. అటల్‌ రాసిన అనేక వ్యాసాలు దేశ విభజనకు కారకుడిగా మహాత్ముడినే బాధ్యుడిని చేశాయి. నీతి కాని రీతిలో ముస్లింలను గాంధీజీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడం అన్నది ఆయన్ని హత్య చేసేంతగా పర్యవసాన పరిణా మాలను విషతుల్యం చేసిందని అటల్‌ విమర్శించారు’ అని అభిషేక్‌ రాశారు. ఇదేమైనా నిందను సంకేతిస్తోందా? కావచ్చు. 

వాజ్‌పేయి గురించి బాగా ప్రచారంలో ఉన్న కొన్ని కథనాల్లో అసలు నిజమే లేదనీ, అవి కేవలం అపోహలేననీ ఈ పుస్తకం తేల్చే స్తుంది. 1971 భారత్‌–పాక్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ ఓడిపోయిన డిసెంబర్‌ 16వ తేదీ నాడు ఇందిరాగాంధీని దుర్గాశక్తిగా అటల్‌ కీర్తించారని ఒక కథనం. అయితే అది నిజం కాదని, ‘ఆ సాయంత్రం అటల్‌ పార్లమెంటులోనే లేరు. అప్పుడు ఆయన ఏదైనా ప్రయాణంలో గానీ, లేదా స్వల్ప అస్వస్థతతో గానీ ఉండి ఉండాలి’ అని అభిషేక్‌ రాశారు. 

అలాగే, అటల్‌ గురించి నెహ్రూ గొప్పగా భావించేవారనీ, ఆయనను భావి భారత ప్రధానిగా గుర్తించేవారనీ ఒక ప్రచారం ఉంది. అది అబద్ధం కాదు. అయితే మునుపు మనకు తెలియని విషయం ఒకటి కూడా ఈ పుస్తకంలో ఉంది. తొలినాళ్లలో అటల్‌పై నెహ్రూ అభిప్రాయం ఇంకోలా ఉండేదని! మొదట్లో ఆయన వాజ్‌ పేయిని ‘అత్యంత అభ్యంతరకరమైన వ్యక్తి’గా భావించారు. ‘జమ్మూలో మితిమీరిన తెంపరితనాన్ని ప్రేరేపిస్తున్నాడు’, ‘అతడిని జమ్మూలోకి అడుగుపెట్టనివ్వకండి’ అని నెహ్రూ తన క్యాబినెట్‌ కార్యదర్శి విష్ణు సహాయ్‌ని కోరినట్లు ఈ పుస్తకం చెబుతోంది.

స్వాతంత్య్రోద్యమంలో వాజ్‌పేయి పాత్ర లేదన్న కాంగ్రెస్‌ వాదనను కూడా రచయిత కొట్టిపారేశారు. ‘గ్వాలియర్‌లో జరిగిన క్విట్‌ ఇండియా నిరసనల్లో వాజ్‌పేయి పాల్గొన్నారన్నది నిజం’. మరీ ముఖ్యంగా, బ్రిటిష్‌ వారికి అటల్‌ సమాచారం చేరవేస్తుండేవాడు అని ‘బ్లిట్జ్‌’ పత్రిక కలిగించిన ప్రేరేపణ పచ్చి అబద్ధం.’ 

మిమ్మల్ని ఆశ్చర్యపరచగల మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. బాల్యంలో వాజ్‌పేయి పేద విద్యార్థి. స్కూల్లో చాలా అరుదుగా మాత్రమే ఆయనలోని ప్రతిభ బయట పడేది. ‘పాంచజన్య’ పత్రిక మాత్రం ఆయన్ని ఆకాశానికెత్తింది. అటల్‌ ఎప్పుడూ తరగతిలో రెండో స్థానంలో నిలవలేదని రాసింది. ఆయనకు ఎల్‌ఎల్‌బి డిగ్రీ ఉందన్న మాటలో కూడా నిజం లేదు. నిజానికి, ‘అటల్‌ లా డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేశారు.’ 

శ్రోతల్ని కట్టిపడేసే వక్తగా ప్రసిద్ధి చెందిన మనిషి, తన తొట్టతొలి స్కూల్‌ డిబేట్‌లో ఘోరంగా ఓడిపోయాడని తెలుసుకోవడం నన్ను ఆహ్లాదపరిచింది. ‘అతడి కాళ్లు చల్లబడ్డాయి. తడబడటం మొదలు పెట్టాడు. ప్రసంగ పాఠం మర్చేపోయాడు. అదొక అవమానకరమైన అనుభవం. సాటి విద్యార్థుల ఆనాటి వెక్కిరింతల్ని జీవితాంతం ఆయన గుర్తుచేసుకుంటూనే ఉన్నారు’.

వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు పుస్తక రచయిత. అటల్‌ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్‌ పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటా రాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్‌ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేకపోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టు కోవాలా?

రెండవ సంపుటి కూడా మొదటి సంపుటం మాదిరిగానే అనేక విశేషాలతో కూడి ఉన్నట్లయితే 1977–2004 మధ్య వాజ్‌పేయి గురించిన సత్యాలను తెలుసుకోడానికి నేను ఎక్కువ కాలం వేచి ఉండలేను. అది ఉత్తమ భాగం అవుతుంది.
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
Advertisement