Sakshi News home page

US presidential election 2024: ప్రైమరీలో ట్రంప్‌కు మరో గెలుపు

Published Thu, Jan 25 2024 5:29 AM

US presidential election 2024: Donald Trump wins New Hampshire GOP primary state elections - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెల్చిన ఆయన బుధవారం న్యూ హ్యాంప్‌షైర్‌ ప్రైమరీలోనూ నెగ్గారు. అయితే భారతీయ అమెరికన్‌ నాయకురాలు నిక్కీ హేలీ ఆయనకు గట్టిపోటీ ఇచ్చారు. ట్రంప్‌కు 55 శాతానికి పైగా ఓట్లు రాగా ఆమె 44 శాతం సాధించారు. న్యూ హ్యాంప్‌షైర్‌ ప్రైమరీని మూడుసార్లు గెలిచిన తొలి రిపబ్లికన్‌ ప్రైమరీ అభ్యర్థిగా ట్రంప్‌ చరిత్ర  సృష్టించారు.

ట్రంప్‌కిస్తే గెలుపు బైడెన్‌దే: హేలీ
తాజా ఫలితాలపై నిక్కీ హేలీ మాట్లాడారు. ‘హ్యాంప్‌షైర్‌లో గెల్చిన ట్రంప్‌కు శుభాకాంక్షలు. అయినా ఇంకా డజన్ల కొద్దీ రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికలు జరగాల్సే ఉంది. పార్టీ ఓటర్ల అంతిమ తీర్పు వెలువడటానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ పోటీలో నేను చిట్టచివరిదాకా పోరా డతా. రేస్‌లో కొనసాగుతా. ఈ పోరు మొదలైనప్పుడు రేసులో మొత్తం 14 మంది ఉండేవాళ్లం. నాకు రెండు శాతం ఓట్లు వచ్చేవి. ఇప్పుడు ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నది నేను మాత్రమే’ అని హేలీ ప్రసంగించారు.

‘‘ట్రంప్‌కు రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కాలని డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. ట్రంప్‌ను అయి తే తేలిగ్గా ఓడించవచ్చని వారి ఆశ. నిజంగా ట్రంప్‌కు అభ్యర్థిత్వం దక్కి తే బైడెన్, కమలా హ్యారిస్‌ల విజయం తథ్యం’’ అని హేలీ అన్నారు. మరోవైపు, ‘‘ఈ రోజు హేలీకి కాళరాత్రి. అయినా తానే గెల్చినట్లు ప్రసంగాలు దంచేస్తోంది’’ అని ట్రంప్‌ ఎద్దేవా చేశారు. సౌత్‌ కరోలినాలో డెమొక్రటిక్‌ పార్టీ ప్రైమరీలో అధ్యక్షుడు బైడెన్‌ నెగ్గారు.

Advertisement
Advertisement