
జాతీయ కాంగ్రెస్‌లో అమేథీ అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొంది. యూపీలోని అమేథీ నుంచి ఎవరిని ఎన్నికల బరిలో నిలపాలనేదానిపై ఢిల్లీ కాంగ్రెస్ దర్బార్‌లో సమావేశం జరిగి 72 గంటలు గడిచినా, ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. త్వరలోనే అమేథీ అభ్యర్థిని తెలియజేస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
అమేథీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తారు. అయితే 2019లో ఈ మ్యాజిక్‌ను స్మృతి ఇరానీ బద్దలు కొట్టారు. అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు కాంగ్రెసేతర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాత పార్టీ ఆలోచనలో పడింది. ఇప్పుడు నామినేషన్‌కు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియక స్థానిక పార్టీ నేతలు అయోమయంలో కూరుకుపోయారు.
అమేథీ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ కాంగ్రెస్, ఎస్పీల సమన్వయ కమిటీ సమాలోచనలు చేస్తోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందన్నారు. మే 3న రాష్ట్ర ఇన్‌చార్జి వస్తారని తెలిపారు. అప్పుడు ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందని ఆయన అన్నారు.
వయనాడ్ ఎన్నికల తర్వాత రాహుల్ అమేథీకి వచ్చే అవకాశం ఉందని గతంలో చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా నిశ్శబ్ధం కొనసాగుతోంది. ఇదేసమయంలో ఖర్గే చేసిన ప్రకటన ఇంకేదో సూచిస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు బీజేపీపై ఆగ్రహంతో ఉన్న వరుణ్.. అమేథీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment