మా గుండెల్లో ఉంటావ్‌ అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య | Sakshi
Sakshi News home page

ఒక కన్నులో ధైర్యం, మరో కన్నులో కరుణ.. అంటూ బోరున ఏడ్చిన సూర్య

Published Fri, Jan 5 2024 1:45 PM

Actor Surya Tribute To Vijayakanth - Sakshi

గతేడాది చివర్లో కోలివుడ్‌ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడును విషాదంలో ముంచెత్తింది. నటుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా ప్రజల మనసు గెలుచుకున్న విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. తమ ప్రియతమ సహ నటుడికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు తమిళ సినీ ప్రపంచం కూడా తరలి వచ్చింది. ఆ సమయంలో రాలేని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ప్రస్తుతం హీరో సూర్య విజయకాంత్‌కు నివాళులు అర్పించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.

విజయకాంత్ స్మారక స్థూపం వద్దకు చేరుకోగానే సూర్య తీవ్రమైన భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడుస్తూ ఆ వీడియోలో ఉన్నారు. విజయకాంత్ ఇంటికి చేరుకున్న సూర్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్తీ కూడా అక్కడే ఉన్నాడు. విజయకాంత్ మరణించే సమయంలో సూర్య విదేశాల్లో ఉన్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక వీడియో ద్వారా విజయకాంత్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సూర్య కెరీర్ తొలి చిత్రం విజయకాంత్‌తోనే మొదలైంది.

వారిద్దరూ కలిసి నటించిన పెరియన్నలో సూర్య టైటిల్ క్యారెక్టర్‌గా నటించాడు. మొదటి చిన్న పాత్ర అని సూర్యను తీసుకున్నారు.. కానీ సూర్య టాలెంట్‌ను గుర్తించిన విజయకాంత్‌ అతని రోల్‌ మరింత సమయం ఉండేలా  డైరెక్టర్‌ ఎస్‌.ఏ చంద్రశేఖర్‌కు చెప్పారట. అలా అతిధి పాత్రలో అనుకున్న సూర్య ఆ సినిమాలో ప్రధాన పాత్రధారిగా కనిపించారు. అలా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. కానీ ఈ సినిమా సూర్య కెరీయర్‌లో 4వ చిత్రంగా వచ్చింది.

విజయకాంత్ స్మారక స్థూపం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సూర్య ఇలా మాట్లాడారు.. 'ఆయనతో కలిసి పని చేస్తూ, మాట్లాడి, తింటూ గడిపిన రోజులు ఎప్పటికీ మరువలేను.. సాయం అడిగిన ఎవ్వరికీ నో చెప్పలేదు. లక్షలాది మందికి సాయం చేసి వారందరికీ పురట్చి కలైంజర్‌గా మారిన నా సోదరుడు విజయకాంత్‌ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఇక లేరనే బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది.  ఒక కన్నులో ధైర్యం, మరో కన్ను కరుణతో జీవించిన అరుదైన కళాకారుడు. ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికి సాయం చేశాడు. పిరాట్చి కలైంజర్ మా గుండెల్లో కెప్టెన్ అయ్యాడు. అన్న విజయకాంత్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని సూర్య సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement