
చంద్రబాబు గెలిస్తే మోదీ చేతిలో కీలుబొమ్మ..: అసదుద్దీన్ ఒవైసీ
పవన్ నటుడు.. మోదీ మహానటుడు
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతిస్తున్నాం
దమ్మున్న నాయకుడు జగన్‌ను మరోసారి గెలిపించి సీఎం చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలిస్తేనే ముస్లిం రిజర్వేషన్ల అమలు కొనసాగుతుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తేల్చి చెప్పారు. జగన్ రిజర్వేషన్లకే కాదు.. రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా పాటుపడతారన్న నమ్మకం తనకుందని చెప్పారు. బుధవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.
‘‘ప్రధాని మోదీ మాట వినను.. ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తానని నిలబడి చెప్పే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఉందా? ఏపీలో చంద్రబాబు గెలిస్తే ప్రధాని మోదీకి కీలుబొమ్మగా మారుతారు’’అని స్పష్టం చేశారు. బీజేపీతో చేతులు కలిపిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. బాబు కూటమిలోని పవన్ కల్యాణ్ ఒక నటుడని, మోదీ మహా నటుడని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. మోదీ సినీ ప్రపంచంలో ఉండి ఉంటే సినిమా రంగాన్ని కూడా భ్రష్టు పట్టించేవారని విమర్శించారు.
వైఎస్సార్ సీపీకే మా సంపూర్ణ మద్దతు
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మళ్లీ గెలుస్తారని, ముస్లిం రిజర్వేషన్లను ఆయనే పరిరక్షిస్తారని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దమ్మున్న నాయకుడని కొనియాడారు. ప్రధాని మోదీని ప్రశ్నించే సత్తా ఆయనకే ఉందన్నారు. వైఎస్సార్ సీపీకే తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలసికట్టుగా జగన్‌ను మరోసారి గెలిపించి, ముఖ్యమంత్రిని చేయాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment