బీజేపీలోకి సి.రాజగోపాలచారి ముని మనవడు | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి సి.రాజగోపాలచారి ముని మనవడు

Published Sun, Apr 9 2023 4:24 AM

C Rajagopalachari great-grandson Kesavan joins BJP - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత దేశ చిట్టచివరి గవర్నర్‌ జనరల్‌ అయిన సి.రాజగోపాలాచారి ముని మనవడు సీఆర్‌ కేశవన్‌ శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దక్షిణభారతంలో మరింతగా పుంజుకునేందుకు కృషిచేస్తున్న పార్టీలోకి నేతలు చేరుతుండటం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీల నేతృత్వంలో ఆయన బీజేపీలో చేరారు.

‘ ప్రజామోదంతో పాలిస్తూ అవినీతిరహిత, సమ్మిళ ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రధాని మోదీపై గౌరవంతో పార్టీలో చేరాను’ అని బీజేపీలోకి వచ్చిన సందర్భంగా కేశవన్‌ వ్యాఖ్యానించాను. తమిళనాడుకు చెందిన కేశవన్‌ తొలినాళ్లలో కాంగ్రెస్‌లో కొనసాగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను వీకేసింగ్‌ పరోక్షంగా విమర్శించారు.

‘ సి.రాజగోపాలాచారి దేశం కోసం అవిశ్రాంతంగా పోరాడారు. కానీ స్వాతంత్య్రం వచ్చాక ఆయన చేసిన త్యాగాలు మరుగునపడేలా, చరిత్ర గర్భంలో కలిసిపోయేలా కొందరు కుట్ర పన్నారు. దేశం కోసం తాము మాత్రమే కష్టపడ్డామని కేవలం ‘ఒక్క కుటుంబం’ మాత్రం ప్రకటించుకుంది’ అంటూ గాంధీల కుటుంబాన్ని పరోక్షంగా విమర్శించారు. తమిళనాడులో కేశవన్‌ బీజేపీ వాణిని గట్టిగా వినిపిస్తారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీలో చేరుతున్న నేతల సంఖ్య పెరుగుతోందని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement