T20 World Cup 2024: రికార్డుల మోత మోగించిన రోహిత్‌ శర్మ | T20 World Cup 2024, IND vs IRE: Rohit Sharma Completes 4000 Runs In T20I History | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: రికార్డుల మోత మోగించిన రోహిత్‌ శర్మ

Published Thu, Jun 6 2024 8:43 AM | Last Updated on Thu, Jun 6 2024 8:55 AM

T20 World Cup 2024, IND vs IRE: Rohit Sharma Completes 4000 Runs In T20I History

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో నిన్న (జూన్‌ 5) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. కోహ్లి (4038), బాబర్‌ (4023) తర్వాత టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌ ఈ రికార్డు సాధించే క్రమంలో మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 

కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో 4000 పరుగుల మార్కును తాకిన రెండో ఆటగాడిగా.. 
టీ20ల్లో వేగంగా 4000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా.. 
విరాట్‌, జయవర్దనే తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా.. 
అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా.. 
ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్‌గా.. 
సచిన్‌, కోహ్లి తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 300 విజయాల్లో భాగమైన మూడో భారత ఆటగాడిగా పలు రికార్డులు నెలకొల్పాడు.

ఐర్లాండ్‌పై విజయం సాధించిన అనంతరం రోహిత్‌ వ్యక్తిగత రికార్డులతో పాటు కెప్టెన్‌గానూ ఓ భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక విజయాలు (55 మ్యాచ్‌ల్లో 42) సాధించిన భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

కాగా, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూయార్క్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్‌ను 96 పరుగులకే (16 ఓవర్లు) ఆలౌట్‌ చేశారు. 

హార్దిక్‌ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-35-2), సిరాజ్‌ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్‌ పటేల్‌ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో గెరాత్‌ డెలానీ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్‌తో పాటు పంత్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో టీమిండియా 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

ఐసీసీ ఈవెంట్లలో రోహిత్‌తో కలిసి తొలిసారి ఓపెనింగ్‌ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంత్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ ఫినిష్‌ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతి​కి బంతి బలంగా తాకడంతో రోహిత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement