2024 మే నెల ముగియడంతో వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన జపనీస్ ఆటోమొబైల్ తయారీదారు 'నిస్సాన్ ఇండియా' కూడా సేల్స్ డేటా రిలీజ్ చేసింది.
కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం.. నిస్సాన్ కంపెనీ మే 2024లో 6204 యూనిట్ల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు సమాచారం. ఈ సంఖ్య ఏప్రిల్ 2024లో 3043 యూనిట్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే కంపెనీ సేల్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం అమ్మకాల్లో కంపెనీ మునుపటి కంటే కూడా 34 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.
మే 2023లో నిస్సాన్ అమ్మకాలు 4631 యూనిట్లు మాత్రమే. అదే మే 2024లో కంపెనీ సేల్స్ 6204కు చేరాయి. ఇందులో దేశీయ విక్రయాలు 2211 కాగా.. ఎగుమతులు 3993గా నమోదయ్యాయి. క్రమంగా నిస్సాన్ మాగ్నైట్ సేల్స్ పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇది మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని.. నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'సౌరభ్ వత్సా' పేర్కొన్నారు.
నిస్సాన్ కంపెనీ భారతీయ మార్కెట్లో ఇప్పడు కేవలం ఒకే కారును విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే కంపెనీ ఇండియాలో తన నెట్‌వర్క్ పెంచుతూనే ఉంది. ప్రస్తుతం నిస్సాన్ 272 టచ్‌పాయింట్‌లను కలిగి ఉంది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేల్స్ మాత్రమే కాకుండా సర్వీస్ కూడా అందిస్తోంది.
కంపెనీ తన నిస్సాన్ మాగ్నైట్ SUVని ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో సీషెల్స్, బంగ్లాదేశ్, ఉగాండా, బ్రూనై వంటి దేశాలు మాత్రమే కాకుండా.. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి మధ్యప్రాచ్య దేశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment