‘నిరాహార దీక్ష ముగిసినా.. నా పోరాటం ఆగదు’ | Sakshi
Sakshi News home page

‘నిరాహార దీక్ష ముగిసినా.. నా పోరాటం ఆగదు’

Published Wed, Mar 27 2024 7:26 AM

Sonam Wangchuk Ends 21 Day Fast Over Ladakh Demands - Sakshi

ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్ చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష మంగళవారం ముగిసింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని,  ఆరో షెడ్యూల్‌ వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆయన ఈ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే నిరాహార దీక్ష ముగింపుతో తన పోరాటం ఆగిపోదని సోనమ్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఆయన మార్చి 6 తేదీనా ఈ దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే.

‘నిరాహార దీక్ష  విరమించే కార్యక్రమంలో ఏడు వేల మంది పాల్గొన్నారు. నేను మళ్లీ పోరాటం చేస్తా. నా పోరాటంలో ఈ నిరాహార దీక్ష కేవలం మొదటి అడుగు మాత్రమే. మహాత్మా గాంధీ చేపట్టిన నిరాహారదీక్షల్లో 21 రోజుల దీక్షే ప్రధానమైంది. ఈ  రోజు  చాలా ముఖ్యమైంది. కేవలం తొలి దశ నిరాహార దీక్ష  మాత్రమే నేటి( మంగళవారం)తో ముగిసింది. కానీ పోరాటం ముగిసిపోలేదు.

మహిళలు 10 రోజు పాటు మరో నిరాహార దీక్ష చేపట్టనున్నాను. యువత, బౌద్ధ సన్యాసులు కూడా పాల్గొంటారు. ఇలా నేను, నా తర్వాత మహిళలు నిరాహార దీక్ష చేపడతారు. ఇలా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. నా నిరాహార దీక్షలో ఒకే రోజు సుమారు 6వేల మంది పాల్గొన్నారు’ అని సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. 

అంతకు ముందు ‘ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దేశానికి చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉ‍న్న రాజనీతి రాజనీతిజ్ఞులు కావాలని నేను ఆశిస్తున్నా. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు మా డిమాండ్లను నెరవేర్చి వారు కూడా రాజనీతిజ్ఞులమని రుజువు చేసుకుంటారని ఆశిస్తున్నా’అని సోనమ్‌ వాంగ్‌చుక్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేసిన వీడియోలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 5 ఆగస్ట్‌ 2019 జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ 370 రద్దు చేసి  జమ్ము కశ్మీర్‌, లడాక్‌ కేంద్రగా ప్రాంతపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. లేహ్‌, కార్గిల్‌ జిల్లాలతో లాడక్‌.. కేంద్ర పాలిత ప్రాంతంగా విస్తరించి ఉంది.

త్రీ ఈడియట్స్‌ సినిమాలో..
అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్‌లు నటించిన ‘త్రీ ఇడియట్స్‌’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర... వాంగ్‌చుక్ క్యారెక్టర్‌ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్‌చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే  ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్‌చుక్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement