Sakshi News home page

యూటర్న్‌ చంద్రబాబు బాగోతం ఇది

Published Thu, Apr 18 2024 12:13 PM

Kommineni Srinivasa Rao Counter To Chandrababu Pawan Kalyan Comments on Volunteers - Sakshi

వలంటీర్లకు పది వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం ద్వారా మన పాలన గొప్పగా ఉందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు... ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్  జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్య..

రాష్ట్రం విధ్వంసం అయింది..జగన్ ఇంతకాలం ప్రజలకు కనిపించలేదు.. ఇప్పడు మళ్లీ జనంలోకి వస్తున్నారు. అది ఓట్ల మీద ప్రేమ.. జగన్‌ను ఎవరూ నమ్మవద్దు.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో ఒక భాగం

ఐదుకోట్ల మందికి ఏ ఒక్క నాయకుడో సరిపోరు. మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి.కేంద్ర సహకారం, చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త విషయం 

పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి ,మోదీ సంకల్పం ..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బలం.. బీజేపీ ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్య

ఈ నలుగురు కొద్ది రోజుల క్రితం తణుకు వద్ద జరిగిన సభలో చేసిన ప్రసంగాలను విశ్లేషించండి. జగన్ తాను ఐదేళ్ల పాలన సమయంలో చేసిన వివిధ అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సాకల్యంగా వివరించడంతో పాటు, చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థపై యూ టర్న్ తీసుకున్న తీరును సమర్ధంగా వివరించగలిగారు.అంతేకాక చంద్రబాబు 2014 లో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలు, వాటిని అమలు చేయని వైనాన్ని విపులంగా ప్రజలకు తెలియచెప్పారు.

జగన్ సభ ఒక ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున జరిగితే, కూటమి సభ ఒక రోడ్డుమీద జరిపి జనం బాగా వచ్చారని సంతోషపడడం కూటమి నేతల వంతుగా మారింది. జగన్ ఎక్కడా ఎవరిని దూషించకుండా , ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాలలో పోటీచేస్తున్న టీడీపీ ,ఇతర పార్టీల అభ్యర్దుల ప్రస్తావన తేకుండా ,తన పార్టీ అభ్యర్ధులను మాత్రం పరిచయం చేసి గెలిపించాలని కోరుతున్నారు. కాని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎక్కడకు వెళితే అక్కడ ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిపై తీవ్రమైన విమర్శలు, అడ్డగోలు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని యత్నించారు.

జగన్ తన స్కీముల గురించి ప్రజలకు తెలియచెప్పి, తాను ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు.పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది.ఇంతకాలం వలంటీర్లను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చంద్రబాబు మాదిరి ఎప్పటికప్పుడు నాలుక మడతపెట్టి మాట మార్చినట్లు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నారు.  వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లకుండా చేసిన నేపద్యంలో టీడీపీకి అది పెద్ద ఇబ్బందిగా మారింది. దానిని జగన్ తన స్పీచ్‌లో క్యాష్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా తన పాలనకు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి విపక్షనేతను డిఫెన్స్ లో పడేశారు. అయితే  చంద్రబాబు చేసే  వాగ్ధానాలు ప్రజలను మోసం చేయడానికే కాని, అమలు చేయడానికి కాదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుని ప్రజలతో అవునని చెప్పించారు.

ఉదాహరణకు రుణమాఫీ,నిరుద్యోగ భృతి వంటివాటిలో చంద్రబాబు మాట తప్పిన  వైనాన్ని జగన్ తెలియచెప్పారు.అలాగే తన  ప్రభుత్వంలో పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్లు,  మెడికల్ కాలేజీలు, పరిశ్రమలకు పునాది పడుతున్న తీరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గత మూడేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వైనాన్ని జగన్ విరించారు. కాని అదే చంద్రబాబు,లేదా పవన్ కళ్యాణ్ లు తమ ప్రసంగాలలో ఎక్కడా స్పెసిఫిక్‌గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములను విమర్శించలేకపోతున్నారు. పైగా వాటిని మరింతగా ఎక్కువ చేసి అమలు చేస్తామని చెప్పారు.

మరి అలాంటప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిందని ఆ నేతలు ఎలా చెబుతున్నారో అర్దం కాదు. మోడీ సంకల్పం ఉంది కనుక రాష్ట్రానికి ఉపయోగం అని అంటున్నారే తప్ప, కేంద్రం నుంచి ఏమి సాధిస్తామో చెప్పలేని దయనీయ స్థితి కూటమి నేతలకు ఏర్పడింది. ఉదాహరణకు ప్రత్యేక హోదా అంశాన్ని కూటమి నేతలు ప్రస్తావించలేకపోతున్నారు.ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం నుంచి వీరు ఏమి సాధిస్తారో ఎవరికి వివరించలేకపోతున్నారు.రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం డ్రామాలు ఆడుతుండడం, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మొదలైన వాటి గురించి వీరు ఒక్క ముక్క మాట్లాడడం లేదు.

గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అన్నప్పుడు కేంద్ర నేతలతో పాటు  బీజేపీ రాష్ట్ర నేత దగ్గుబాటి పురందేశ్వరి అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. అందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా?బీజేపీ ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ లను తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై చంద్రబాబు అభిప్రాయం ఏమిటి? ఇలాంటివాటిపై అటు చంద్రబాబు కాని, ఇటు పవన్ కళ్యాణ్ కాని మాట్లాడకుండా ఉమ్మడి ఎజెండాతో ,ప్రజా మానిఫెస్టోతో  ప్రజల ముందుకు వస్తున్నామని చెబితే ఎవరు నమ్ముతారు? అసలు ఉద్యోగాలే రాలేదని ఒకసారి, సచివాలయాలలో కొత్తగా వచ్చిన లక్షన్నర మంది ఉద్యోగుల గురించి మరోసారి చంద్రబాబు మాట్లాడుతారు. వీటిలో ఏది విద్వంసం,ఏది నాశనమో చెప్పలేరు.అప్పుల గురించి మాట్లాడతారు.రాష్ట్రం అప్పులపాలైతే సూపర్ సిక్స్ పేరుతో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఎలా చంద్రబాబు ఖర్చు చేస్తారో వివరించరు.

జగన్ అమలు చేసిన అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో ఎందరు పిల్లలు  ఉంటే అందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుంటారు.అది ఎలా సాధ్యమో ఆయన చెప్పరు. ఆ పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్,పురందేశ్వరిలు మాట్లాడరు.ఇవన్ని చూస్తుంటే వీళ్లకు ఒక ఎజెండా లేదు. ముగ్గురు కలిసి జనాన్ని ఎలా మభ్య పెట్టాలా అన్నదానపైనే దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తుంది.

అయితే జగన్ ను తిట్టడం, లేదంటే రాష్ట్రం విధ్వంసం అయిందని ఆరోపించడం,లేకుంటే జగన్ ఇచ్చిన స్కీములను మరింత ఎక్కువ ఇస్తామని బొల్లడం..జగన్ సభలకు, చంద్రబాబు సభలకు తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తుంది.పురందేశ్వరి మాత్రం ఒక మాట చెప్పారు. పవర్ స్టార్ పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి, మోడీ సంకల్పం రాష్ట్రానికి ఉపయోగపడతాయని అన్నారు. చంద్రబాబుదంతా కుయుక్తులేనని గతంలో ఈమె అన్నారు. ఇప్పుడేమో ఆ కుయుక్తే ఏమైనా తనకు ఎంపీ  పదవి వచ్చేలా చేస్తుందేమోనన్న ఆశతో పురందేశ్వరి ఉన్నారు. పవన్  అయితే  ఐదు కోట్ల మందికి ఒక్క నాయకుడు చాలడని అన్నారు.

మూడుపార్టీల బలమైన నాయకత్వం కావాలి అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలట.కేంద్ర సహయం ఉండాలట. అంటే చంద్రబాబు ఒక్కడు ముఖ్యమంత్రిగా సరిపోడని పవన్ చెబుతున్నట్లే కదా! చంద్రబాబుకు అంత సామర్ధ్యం లేదనే కదా పవన్ ఉద్దేశం? అధికారం వచ్చాక ఈయన కూడా అందులో భాగస్వామి అవుతారా?అవ్వరా? ఎవరిమీద పోరాడుతారు?లేదంటే ఈయన బయట ఉండి మళ్లీ స్పీచ్ లు ఇస్తూ తిరుగుతారేమో తెలియదు.ఒకటి మాత్రం జనానికి చెప్పారు.  రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం సరిపోదని చెబుతున్నారని అర్ధం అవుతుంది.రాష్ట్రం కొన ఊపిరితో ఉందట ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ అట. అలాగైతే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీతో ఎందుకు చెప్పించలేకపోయారు.ఆయన అసలు  రాష్ట్రానికి ఒక్క వరం అయినా ఇచ్చి వెళ్తారా?కేవలం తన కేసులకోసం, కొన ఊపిరితో ఉన్నటీడీపీని బతికించుకోవడం కోసం పొత్తు  పెట్టుకుని అదేదో రాష్ట్రం కోసం అని చెబితే జనం చెవిలో పూలు  పెట్టుకుని వినే రోజులు కావివి. వైఎస్సార్‌సీపీ విధ్వంసం చేస్తోందనే పొత్తు పెట్టుకున్నామని పవన్ అంటున్నారు. ఏమి విధ్వంసమో ఈ మూడు పార్టీల నేతలు చెప్పలేకపోతున్నారు.

ఏదో పిచ్చి,పిచ్చి ప్రకటనలు చేసి, సినిమా డైలాగులు మాట్లాడి జనాన్ని బురిడి కొట్టించాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తోంది.తమ పార్టీలను బతికించుకోవడానికి, తాము గెలవలేమన్న భయంతో ఈ మూడు పార్టీలు కలిశాయి తప్ప ఇంకొకటి కాదు. ఓట్లు చీలకూడదని ఎప్పుడైతే అన్నారో,  అప్పుడే వీరంతా ఓటమిని అంగీకరించిన్లే అనుకోవాలి.వైఎస్సార్‌సీపీ వెంటిలేటర్ పై ఉందని అంటున్న  చంద్రబాబు దానిని నిజమని నమ్మి ఉంటే ఒంటరిగా పోటీచేసి సవాలు విసిరేవారు. ఇలా అధికారం కోసం జనసేన, బీజేపీ వంటి చిన్నపార్టీలను కాళ్లావేళ్లపడి ఎందుకు బతిమలాడుకుంటారు.ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకుని మరీ బీజేపీతో ఎందుకు పొత్తు  పెట్టుకుంటారు. జగన్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరిల వద్ద సమాధానం లేదు. అందుకే వీరు ఇలా సోది ప్రసంగాలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారనుకోవాలి. తాను గెలుస్తానన్న ధైర్యం ఉంది కనుక జగన్ ఒంటరిగా బరిలో దిగి ప్రత్యర్దులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు ఈ కిచిడి కూటమి కావాలా? లేక జగన్ సాహసవంతమైన నాయకత్వం కావాలా? అన్నది తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement

తప్పక చదవండి

Advertisement