Chandrababu And Pawan Kalyan Released Manifesto With 177 Election Promises, Details Inside | Sakshi
Sakshi News home page

TDP Janasena Manifesto: బాబు కిచిడీ మేనిఫెస్టో

Published Wed, May 1 2024 6:01 AM | Last Updated on Wed, May 1 2024 6:13 PM

Chandrababu and Pawan Kalyan released manifesto with 177 election promises

సూపర్‌ సిక్స్‌లో సగం వైఎస్సార్‌సీపీ నుంచి, సగం పక్క రాష్ట్రాల నుంచి కాపీ

177 ఎన్నికల హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌

నిస్సిగ్గుగా వైఎస్‌ జగన్‌ అమ్మఒడి పథకం పేరు మార్చి అమలు చేస్తానని హామీ

రైతు భరోసా పేరు మార్చి యథాతథంగా మేనిఫెస్టోలో పెట్టిన బాబు

అధికారంలో ఉన్నప్పుడు చేయని మెగా డీఎస్సీపై యువతకు గేలం

ఏపీలో అమల్లో ఉన్న పలు కార్యక్రమాలను మేనిఫెస్టోలో పెట్టుకున్న వైనం

సాక్షి, అమరావతి: చంద్రబాబు అంటేనే మోసం, మాయ, వెన్నుపోటు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వస్తే అదే ప్రజలను మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, తాను లాభప­డటం.. ఇదే నైజం. ప్రజలకు మేలు చేసే మనసు ఆయనకు ఏ కోశానా లేదు. మంగళవారం విడు­దల చేసిన తాజా మేనిఫెస్టోలోనూ చంద్రబాబు ఇదే నైజాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఏపీలో, పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టో తయారు చేశారు.

నిబద్దతతో పనిచేసే నాయకుడైతే ప్రజలకు తానేమి మేలు చేస్తాడో ఆలోచించి, వాటిని మేనిఫెస్టోలో చెప్తాడు. కానీ, చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయరన్నది గతంలో ఆయన పరిపాలనే విస్పష్టంగా చెబుతుంది. ఇటువంటి నాయకుడి మేనిఫెస్టోలో ఏ హామీలు ఉంటే ప్రజలకేం ఉపయోగం? అందుకే చంద్ర­బాబు ఇప్పటికే రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న ప్రజోపయోగ పథకాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నవీ తెచ్చి తాజా మేనిఫెస్టోలో చేప్పే­సుకున్నారు.. ఏమాత్రం కష్టం లేకుండా. 

గతంలో 2104, 2019లో తాను ప్రజలను మోసగించడానికి ఇచ్చిన హామీలను కూడా ఈసారి మేనిఫెస్టోలో ఉంచారు.. ఇందులో ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈ మేనిఫెస్టోలో 177 హామీలు ఉన్నప్పటికీ, అవన్నీ కాపీ కొట్టినవి, పాతవే.

అరువు తెచ్చుకున్న సూపర్‌ సిక్స్‌
చంద్రబాబు తాజా మేనిఫెస్టోలో సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రకటించిన ప్రధాన హామీలు అన్నీ అరువు తెచ్చుకున్నవే. వీటిలో సగం రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాలు కాగా, మిగతావి పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందించే పథకాలను అమ్మఒడి, రైతు భరోసా పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదేళ్ల నుంచి అమలు చేస్తోంది.

 వీటికే పేర్లు మార్చి, చంద్రబాబు మేనిఫెస్టోలో  రాసుకున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా వైఎస్సార్‌సీపీ నుంచి కాపీ కొట్టిందే. ఇది కాకుండా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. 

అంతే కాదు.. జాబు కావాలంటే బాబు రావాలంటూ 2014లో ఊదరగొట్టిన చంద్రబాబు.. జాబు లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతను నిలువునా మోసం చేసి, మళ్లీ అదే హామీ ఇప్పుడూ ఇవ్వడమే ఆయనలోని గొప్పతనం.

అవినీతి అమరావతిని మళ్లీ కడతారట
అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదలను పట్టించుకోని చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే వారిని సంపన్నులను చేసేందుకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌ (పీ4) పేరుతో పథకాలు ఇస్తానని ప్రకటించారు. అంతర్జాతీయ అవినీతి కుంభకోణంగా మారిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల గురించి పట్టించుకోకుండా అమరావతి జపం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని నమ్మబలుకుతున్నారు. 

విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వద్దే వద్దంటూ అక్కడ హైకోర్టు బెంచిని తక్షణం ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొల్లగొట్టి లక్షలాది మందిని నడిరోడ్డున పడేసిన విషయాన్ని మరచిపోయి, ఇప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు.

రూ.4 వేలు పింఛనంటూ మాయ హామీ
చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ సామాజిక పింఛన్లు రూ.1,000 మాత్రమే ఇచ్చారు. అందు­లోనూ చాలా మోసాలు. ఇచ్చిందే తక్కువ. అందు­లోనూ జన్మభూమి కమిటీల దందా, అవినీతి. వృద్ధులు నెల నెలా నానా అవస్థలుపడి ప్రభుత్వ ఆఫీ­సులకు వెళ్లి, అక్కడ ఇచ్చినంత తెచ్చుకోవాల్సిన దు­స్థితి. అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పెన్షనర్లకు చంద్రబాబు పెట్టిన అవస్థల నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జగన్‌ చర్యలు చేపట్టారు.

 బాబు రూ. వెయ్యి పింఛను ఇవ్వగా, దానిని సీఎం జగన్‌ రూ.3 వేలు ఇచ్చి, ఇంటి వద్దనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తు­న్నారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లుగా ఇస్తున్న రూ.3 వేలను రూ.4 వేలకు పెంచి ఇస్తామని చంద్రబాబు మభ్యపెట్టే హామీ ఇచ్చారు. అది కూడా 50 ఏళ్లకే ఇస్తామని చెప్పడం మాయ చేయడానికేనని కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. 

గతంలో చేయకుండా ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ అంటూ ప్రకటించారు. ప్రతి ఇంటికీ మేలు చేసేలా జగన్‌ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్య­వస్థను తూలనాడి, 2 నెలలుగా వారిని విధులకు దూరం చేసిన చంద్రబాబు.. వారికి రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం ఆయన దివాళాకోరుతనమే. ఉద్యోగుల గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే వారికి మేలు చేస్తానంటున్నారు.

ఇది మరో రకం మోసం
ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించడమూ ప్రజలను మోసం చేయడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఈ మేనిఫెస్టోలోనూ పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని, నదుల అనుసంధానం, ప్రతి ఎకరానికి నీరు అంటూ పాత హామీలను పెట్టారు.

 రాష్ట్రంలో ఇప్పుడు పారదర్శకంగా ఇసుక విధానం అమలవుతుండగా తన హయాంలో అభాసుపాలైన ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ తెస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ వంటి సకల మౌలిక వసతులతో గ్రామాల ముఖ చిత్రమే మారిపోయినా,  గ్రామాల్లో మౌలిక వసతులు, మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్‌ ఫ్రం హోం స్టేషన్లు అంటూ హామీలిచ్చారు. 

బీసీలకు బురిడీ
చంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో రిజర్వేషన్లు తగ్గించేశారు. ఇప్పుడు 34 శాతం ఇస్తామని చెప్పడం ఆ వర్గాలను మభ్యపెట్టడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఇప్పుడూ బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తామని మరోసారి పాత హామీనే ఇచ్చారు. 

మరోసారి మహిళలను మోసం చేసేలా..
స్వయం సహాయక సంఘాలను మళ్లీ కొత్త తరహాలో మోసం చేయడానికి చంద్రబాబు కొత్త హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరినీ వంచించి, ఆ సంఘాలను దివాలా తీయించారు చంద్రబాబు. ఇప్పుడు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామంటూ నిస్సిగ్గుగా మరోసారి ప్రకటించారు. ఇది మరోసారి మహిళలను వంచనకు గురిచేయడమే.

ఆరోగ్యశ్రీకి మంగళమే!
సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని ప్రకటించారు. అంటే చంద్రబాబు వస్తే ప్రజలకు బీమానే వర్తిస్తుంది తప్ప, ఆరోగ్య శ్రీ ఉండదు. ఆరోగ్యానికి భరోసా ఉండదు.

 డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలో కోట్ల మందికి పంపిణీ చేసినా తానూ చేస్తానని చెప్పారు. విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలి డాక్టర్, జగనన్న సురక్ష పథకాలన్నీ వైద్యాన్ని పేదలకు చేరువ చేయగా వాటికి ఏమాత్రం సాటిరాని, తీసికట్టుగా జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్‌ వ్యాధులకు ఉచితంగా జనరిక్‌ మందులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. 

విద్యా రంగంలో వైఎస్‌ జగన్‌ విప్లవాత్మకమైన మార్పులు తెస్తే, వాటి దరిదాపుల్లోకి సైతం రాలేని స్థితిలో కేజీ టు పీజీ సిలబస్‌ని రివ్యూ చేస్తామని, మూతపడిన పాఠశాలలు పునరుద్ధరిస్తామంటూ పస లేని హామీలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రస్తుతం అమల్లో ఉండగా, నేరుగా కాలేజీలకే రుసుం చెల్లిస్తామని ప్రకటించి దానిపైనా తిరకాసు హామీ ఇచ్చారు.

ఇప్పుడు అమలవుతున్నవే ఆయనొచ్చి చేస్తాడట..
»  సీఎం జగన్‌ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, కాపులు, వడ్డెరలు, ఆర్య వై­శ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేద­లకు నవరత్నాలతో రూ.వేల కోట్ల సంక్షేమ అందిస్తుంటే.. ఇప్పుడు బాబు వా­రి సం­క్షే­మానికి చర్యలు తీసుకుంటానని అన­డం కొసమెరుపు.
»    2019 ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని, పక్కా ఇళ్లు కట్టిస్తానంటూ పాత పాటే పాడారు. నిజానికి ఈ ఐదేళ్లలో పేదలకు సీఎం వైఎస్‌ జగన్‌ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగా, వీటిలో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరు­గు­తోంది. ఆయనొచ్చి చేసేదేముంది?
»     నైపుణ్య శిక్షణ కేంద్రాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ లైబ్రరీలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నా, వాటి గురించి మేనిఫెస్టో చేర్చడం ప్రజలను మభ్య­పెట్టడం కాక మరేమిటి? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉండగా తానూ అమలు చేస్తానని ప్రకటించడం పక్కా మోసమే.
»    వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏడాది నుంచి రాష్ట్రంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తుండగా.. తాము అందిస్తామంటూ అదే హామీ ఇచ్చారు.
»  గొర్రెల పెంపకం యూనిట్లకు రాయి­తీలు, బీమా సౌకర్యం ఇప్పటికే ఉండగా దాన్ని తాను ఇస్తానని అంటున్నారు.
»     నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా దాన్ని ఇస్తానంటూ చెప్పుకొంటున్నారు. 
»      మత్స్యకారుల సంక్షేమానికి ఇప్పటికే వైఎస్సార్‌సీపీ రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తుండగా దాన్ని పెంచుతామని నమ్మబలికారు.
»    వైఎస్సార్‌సీపీ వాహన మిత్ర పథకం అమలు చేస్తూ రవాణా రంగ కార్మికు­లకు మేలు చేస్తుండగా, ఇప్పుడు తాను డ్రైవర్లకు ప్రమాద బీమా ఇస్తానని, వడ్డీ సబ్సిడీ ఇస్తానంటూ నమ్మబలికారు.
»   వ్యవసాయానికి 9 గంటల ఉచిత వి­ద్యుత్‌ విద్యుత్‌ సరఫరా ప్రస్తు­తం వైఎ­స్సార్‌సీపీ ప్రభుత్వం ఇస్తుండగా తాను అధికారంలోకి వస్తే ఇస్తానన్నారు.
»   వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే ధరల స్థిరీ­కరణ నిధి ఏర్పాటు చేయగా, ఇప్పుడు తాను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
»     సేంద్రీయ వ్యవసాయం, డ్రిప్‌ ఇరిగేషన్‌ సబ్సిడీ, ప్రభుత్వ గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్ల వంటివన్నీ వైఎస్సాÆŠ­సీపీ ప్రభుత్వం చేస్తుండగా వాటిని తన మేనిఫెస్టోలో పెట్టుకు­న్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలన్నీ తాను చే­స్తాన­నడం ప్రజలను వంచించడమే కదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement