ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు కావాలని అంచనా
అంత సొమ్ము సమకూర్చుకోవడం సాధ్యమా?
అన్ని ఆర్థిక వనరులు రాష్ట్రంలో ఉన్నాయా?
ప్రజలను వంచించేందుకు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చేస్తావా?
సీఎం జగన్ పథకాల అమలుకు రూ.70 వేల కోట్ల వ్యయం
అన్ని లెక్కలు వేసుకుని, ఆర్థిక క్రమశిక్షణ చూసుకునే ఆయన హామీలిచ్చారు
ఏ లెక్కలు చూడకుండా, ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీలకు డబ్బులెలా తెస్తావ్?
చంద్రబాబు మేనిఫెస్టోపై నిపుణుల విస్మయం
సాక్షి, అమరావతి: అధికారమే పరమావధిగా ప్రజలను వంచించేందుకు సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిపుణులను సైతం వేధిస్తోంది. అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు అసలు వాటిని అమలు చేయడం సాధ్యమా? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? అంత సొమ్ము ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే అంశాలకు సమాధానం లేదు.
ప్రాథమిక అంచనాల ప్రకారం చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అంత డబ్బు సమీకరించుకునే అవకాశం ఉందా? రాష్ట్రంలో అందుకు తగ్గ వనరులు ఉన్నాయా?.. అంటే లేదనే సమాధానం వస్తుంది.
వాస్తవికంగా ఆలోచిస్తూ..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టే సీఎం వైఎస్ జగన్‌కు ఇంకా సంక్షేమం అందించాలని మనసులో ఉన్నా కొత్త హామీలు ఇవ్వలేదు. అన్ని లెక్కలు వేసుకుని, వనరుల సమీకరణ చూసుకుని చేయగలిగే హామీలను మాత్రమే ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూరుస్తున్నారు.
దీనికి అదనంగా మరికొంత లబ్ధిని జోడిస్తూ మేనిఫెస్టోను రూపొందించారు. తాము అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, వాటికి అయ్యే ఖర్చు, ఎక్కడి నుంచి సమీకరిస్తామనే విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోనే డబ్బు జమ చేయడం (డీబీటీ) లాంటి వినూత్న విధానాల ద్వారా చాలా పకడ్బందీగా ఐదేళ్లు ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నెట్టుకొచ్చారు.
పింఛన్లకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కనుకే రూ.3,500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అప్పులు తెద్దామన్నా అవి కూడా పరిమితులకు లోబడే తేవాల్సి ఉంటుంది. అన్నీ బేరీజు వేసుకుని, ఉన్న వనరులను సది్వనియోగం చేసుకుంటూ పథకాలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.
వేలం పాటలా పోటీ పడి హామీలు
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీస ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారు. చిత్తశుద్ధితో నెరవేర్చే ఉద్దేశం లేనందువల్లే వేలం పాటలో రేటు పెట్టినట్లుగా సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలకే తాను ఇంకా ఎక్కువ ఇస్తానని నమ్మబలికారు. అమ్మఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి ఇష్టం వచ్చినట్లు ప్రకటించారు.
సీఎం జగన్ అమలు చేస్తున్న చాలా పథకాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాలను సైతం కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను ఏమార్చేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని హామీలను అమలు చేయడం సాధ్యమా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి ఆయన వద్ద సమాధానం లేదు. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఈ హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందని అడగడంతో సమాధానం చెప్పకుండా కస్సుమని మండిపడ్డారు.
దాన్నిబట్టే ఆయనకు తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైంది. సీఎం జగన్ ఇస్తున్నారు కాబట్టి తాను అంతకంటే ఎక్కువ ప్రకటించి ప్రజలను నమ్మించాలి, ఆ తరువాత ఎలాగూ అమలు చేసేది లేదని తనకు అలవాటైన రీతిలో వాగ్దానాలు చేస్తున్నారు.
సాధ్యం కాదనే బీజేపీ పట్టించుకోలేదు
చంద్రబాబు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించడం వల్లే బీజేపీ ఆయన మేనిఫెస్టోను అంగీకరించలేదు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతల ఫొటోలు మేనిఫెస్టోలో కనీసం ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. చివరికి మేనిఫెస్టోను తాకడానికి సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్ ఇష్టపడలేదంటే బాబు హామీలపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రబాబు హామీలకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదని చెప్పకనే చెప్పేశారు.
రాష్ట్రంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితులు లేక, కేంద్రం సహకరించకపోతే చంద్రబాబు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి సమాధానమే లేదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసేవి కావని తేటతెల్లమైంది. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, మరోసారి మాయ చేసేందుకే వేలం పాట మాదిరిగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. పొరపాటున జనం నమ్మితే ఇక అంతే సంగతులు. 2014లో మాదిరిగా ఆ మేనిఫెస్టో మాయం కావడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment