హామీలన్నీ సీఎం జగన్ అమలు పరిచినవే
అరచేతిలో వైకుంఠం చూపే చంద్రబాబు
ఓట్లకోసం ముస్లింలు, క్రిస్టియన్లు కావాలి మేనిఫెస్టోపై మూడోవ్యక్తి ఏడి?
డబ్బులు ఎక్కడినుంచి తెస్తావో వివరించాలి
మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.
నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు.
అధికారం కోసమే కూటమి
అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు.
రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్‌లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.
చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్‌లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment