Sakshi News home page

Ind Vs Eng: టీమిండియా రాజభోగాలు.. రోహిత్‌తో పాటు అతడికీ రాయల్‌ సూట్‌!

Published Mon, Feb 12 2024 4:42 PM

Ind vs Eng 3rd Test Rohit Sharma Royal Suite Khichdi For Dinner Details: Report - Sakshi

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు గుజరాత్‌లో జరుగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్‌ స్టేడియం ఇందుకు వేదిక. ఇక ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరొకటి గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15 నుంచి టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య మొదలుకానున్న మూడో టెస్టు ఇరుజట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిరీస్‌లో మరో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలని రోహిత్‌ సేన- స్టోక్స్‌ బృందం పట్టుదలగా ఉన్నాయి.

మెనూలోని వంటకాలు ఇవే
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు రాజ్‌కోట్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్రికెటర్లు బసచేసే సయాజీ హోటల్లో.. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తున్న వంటకాలకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఆజ్‌తక్‌ కథనం ప్రకారం.. క్రికెటర్ల మెనూలో సంప్రదాయ వంటకాలు ఫఫ్దా- జిలేబి, ఖాఖ్రా, గతియా, తెప్లా, ఖమన్‌(బ్రేక్‌ఫాస్ట్‌)లతో పాటు కతియావాడి భోజనంలో భాగంగా.. దహీ తికరి, వఘేరెలా రోట్లో(పెరుగు, వెల్లుల్లి కలిపి బజ్రా రోటీని ఫ్రై చేస్తారు) వంటివి చేర్చారు. 

రాజభోగాలు
ఇక డిన్నర్‌ కోసం కిచిడి కఢీ ప్రత్యేకంగా తయరు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సయాజీ హోటల్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ బస కోసం ప్రత్యేకంగా రాయల్‌ సూట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

కాగా ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ ఇటీవలే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్‌ కోహ్లి సెలక్షన్‌కు అందుబాటులో ఉండకపోవడంతో అతడిని పక్కనపెట్టిన సెలక్టర్లు.. బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌నకు తొలిసారి పిలుపునిచ్చారు.

అతడిపై వేటు..
అదే విధంగా.. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ను తప్పించిన మేనేజ్‌మెంట్‌.. తొలి టెస్టు తర్వాత గాయపడిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, బ్యాటర్‌ కేఎ​ల్‌ రాహుల్‌ కోలుకుంటున్నట్లు తెలిపింది. వారిద్దరిని మూడో టెస్టుకు ఎంపిక చేసినా.. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న తర్వాతే తుదిజట్టులో చోటు దక్కించుకుంటారని తెలిపింది.

వాళ్లిద్దరికి సన్మానం
ఇదిలా ఉంటే.. రవీంద్ర జడేజా, ఛతేశ్వర్‌ పుజారాలకు సౌరాష్ట్ర క్రికెట్‌ గ్రౌండ్‌ సొంతమైదానం. ఈ నేపథ్యంలో మూడో టెస్టు ఆరంభానికి ముందే ఈ ఇద్దరు టీమిండియా స్టార్లను సన్మానించాలని స్థానిక క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది.

చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా!

Advertisement

What’s your opinion

Advertisement