Sakshi News home page

IPL 2024: నిప్పులు చెరిగిన ఢిల్లీ బౌలర్లు.. గుజరాత్‌కు ఘోర పరాభవం​

Published Wed, Apr 17 2024 10:45 PM

IPL 2024: Delhi Capitals Beat Gujarat Titans By 6 Wickets - Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్‌ శర్మ (2-0-8-2), ముకేశ్‌ కుమార్‌ (2.3-0-14-3), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (1-0-11-2), అక్షర్‌ పటేల్‌ (4-0-17-1), ఖలీల్‌ అహ్మద్‌ (4-1-18-1), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-16-0) ధాటికి 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది.

వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్‌ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో రషీద్‌ ఖాన్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్‌ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. జేక్‌ ఫ్రేసర్‌ 20, పృథ్వీ షా 7, అభిషేక్‌ పోరెల్‌ 15, షాయ​ హోప్‌ 19 పరుగులు చేసి ఔట్‌ కాగా.. రిషబ్‌ పంత్‌ (16), సుమిత్‌ కుమార్‌ (9) ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. 

రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లతో పాటు 16 పరుగులు చేసిన పంత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. బంతుల పరంగా ఢిల్లీకి ఇది అతి భారీ విజయం. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మరో 67 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

గుజరాత్‌ చెత్త రికార్డులు..

  • ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 100లోపు ఆలౌట్‌ కావడం ఇదే మొదటిసారి. 
  • 2024 సీజన్‌లో ఓ జట్టు 100లోపు ఆలౌట్‌ కావడం కూడా ఇదే మొదటిసారి. 
  • ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ చేసిన 89 పరుగుల స్కోర్‌.. ఇపీఎల్‌ చరిత్రలో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్‌
  • ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఇదే అత్యల్ప టీమ్‌ స్కోర్‌
     

Advertisement

తప్పక చదవండి

Advertisement