IPL 2024 LSG VS MI: Rohit Sharma Scored Runs In A Sequence In The Last Four Birth Day IPL Matches| Sakshi
Sakshi News home page

IPL 2024 MI Vs LSG: పుట్టిన రోజున ఆసక్తికరమైన స్కోర్లు చేసిన రోహిత్‌

Published Tue, Apr 30 2024 9:00 PM

IPL 2024 LSG VS MI: Rohit Sharma Scored Runs In A Sequence In The Last Four Birth Day IPL Matches

ముంబై ఇండియన్స్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ ఇవాళ (ఏప్రిల్‌ 30, 2024) 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్‌ గెలిచి ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. లక్నో ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. రెండో ఓవర్‌లోనే రోహిత్‌ శర్మ (5) వికెట్‌ కోల్పోయింది.

ఆతర్వాత ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 18 పరుగుల వద్ద సూర్యకుమార్‌ (10).. 27 పరుగుల వద్ద తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్యా (0) ఔటయ్యారు. 11 ఓవర్ల అనంతరం​ ముంబై స్కోర్‌ 65/4గా ఉంది. ఇషాన్‌ కిషన్‌ (27), నేహల్‌ వధేరా (11) క్రీజ్‌లో ఉన్నారు. లక్నో బౌలర్లలో స్టోయినిస్‌, మొహిసిన్‌ ఖాన్‌, నవీన్‌ ఉల్‌ హక్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. తిలక్‌ వర్మను రవి బిష్ణోయ్‌ అద్భుతమైన త్రోతో రనౌట్‌ చేశాడు.

 

 కాగా, పుట్టిన రోజున జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ చెత్త షాట​్‌ ఆడి ఐదు బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. హిట్‌మ్యాన్‌ తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొహిసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో స్టొయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ పెవిలియన్‌కు చేరాడు. అయితే హిట్‌మ్యాన్‌ ఔటై పెవిలియన్‌కు చేరాక ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది.

 

రోహిత్‌ తన పుట్టిన రోజున ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 2, 3, 4 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ స్కోర్లన్నీ యాదృచ్చికంగా 5 బంతుల్లో చేసినవి కావడం విశేషం. 2014 జన్మదినాన సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో ఒక్క పరుగు చేసిన రోహిత్‌.. 2022వ సంవత్సరపు పుట్టిన రోజున రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో 2 పరుగులు చేశాడు.

ఆతర్వాత గతేడాది పుట్టిన రోజున రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో 3 పరుగులు చేసిన రోహిత్‌.. 2024వ సంవత్సరపు పుట్టిన రోజున లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో 4 పరుగులు చేసి ఔటయ్యాడు. బర్త్‌ డే రోజున రోహిత్‌ చేసిన స్కోర్లు వరుస క్రమంలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ స్కోర్ల సీక్వెన్స్‌ చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. 1 (5), 2 (5), 3 (5), 4 (5). ఈ సీక్వెన్స్‌ చూసిన తర్వాత కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో ఇలా కామెంట్లు చేస్తున్నారు. రోహిత్‌ వచ్చే ఏడాది బర్త్‌ డే రోజున 5 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటవుతాడంటూ సెటైర్లు వేస్తున్నారు.  

 

 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement