ఐపీఎల్‌కు 17 ఏళ్లు.. తొలి మ్యాచ్‌ ఆడిన వాళ్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు..? | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు 17 ఏళ్లు.. తొలి మ్యాచ్‌ ఆడిన వాళ్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు..?

Published Thu, Apr 18 2024 1:40 PM

IPL 2024: How Many Players Are Still Playing IPL Who Played IPL First Ever Match - Sakshi

క్రికెట్‌ పండుగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్‌ 18) క్యాష్‌ రిచ్‌ లీగ్‌ 17వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి గతాన్ని గుర్తు చేసుకుంది. మీ ఫేవరెట్‌ ఐపీఎల్‌ జ్ఞాపకాన్ని కూడా షేర్‌ చేసుకోండని క్యాప్షన్‌ జోడించింది. దీంతో చాలామంది ఐపీఎల్‌ అభిమానులు తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. ఐపీఎల్‌ అరంగేట్రం మ్యాచ్‌లో ఆడిన వారు ప్రస్తుతం ఎంత మంది ఇప్పటికీ ఆడుతున్నారని అడిగాడు. దీనికి చాలామంది తమకు తెలిసిన సమాధానాలు చెప్పారు. సమాధానం రివీల్‌ చేయకముందు మీకు తెలిసిన సమాధాన్ని మీరు కూడా షేర్‌ చేయండి. 

సమాధానం విషయానికొస్తే.. ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్‌ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ తరఫున ఆడిన వృద్దిమాన్‌ సాహా, ఇషాంత్‌ శర్మ ప్రస్తుతం గుజరాత్‌, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి ఆడిన విరాట్‌ కోహ్లి ఇప్పుడు కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ ఆడిన ఈ ముగ్గురు మాత్రమే ఐపీఎల్‌లో ఇంకా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ చరిత్రలో విరాట్‌ ఒక్కడే నాటి నుంచి నేటి వరకు ఒకే జట్టుకు ఆడుతూ ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు.  

నాటి మ్యాచ్‌ విషయానికొస్తే.. బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ శివాలెత్తిపోవడంతో (73 బంతుల్లో 158; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) కేకేఆర్‌ 140 పరుగల భారీ తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో  మెక్‌కల్లమ్‌ ఒక్కడే సింహ భాగం స్కోర్‌ చేశాడు. సౌరవ్‌ గంగూలీ 10, రికీ పాంటింగ్‌ 20, డేవిడ్‌ హస్సీ 12, మొహమ్మద్‌ హఫీజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు.ఆర్సీబీ బౌలర్లలో జహీర్‌ ఖాన్‌, ఆష్లే నోఫ్కే, జాక్‌ కలిస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆశోక్‌ దిండా (3-0-9-2), ఇషాంత్‌ శర్మ (3-0-7-1), అజిత్‌ అగార్కర్‌ (4-0-25-3), సౌరవ్‌ గంగూలీ (4-0-21-2), లక్ష్మీ రతన్‌ శుక్లా (1.1-0-12-1) ధాటికి 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (ప్రవీణ్‌ కుమార్‌ (18 నాటౌట్‌)) రెండంకెల స్కోర్‌ చేశారు. ద్రవిడ్‌ 2, వసీం జాఫర్‌ 6, విరాట్‌ కోహ్లి 1, జాక్‌ కలిస్‌ 8, కెమరూన్‌ వైట్‌ 6, మార్క్‌ బౌచర్‌ 7, బాసిల్‌ థంపి 0, నోఫ్కే 9, జహీర్‌ ఖాన్‌ 3, సునీల్‌ జోషి 3 పరుగులు చేసి ఔటయ్యారు. వికెట్‌ కీపర్‌గా వృద్దిమాన్‌ సాహా కలిస్‌ క్యాచ్‌ అందుకున్నాడు. 

Advertisement
Advertisement