ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వరుస ఓటములు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 30) లక్నోతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజ్‌లో 24 లక్షల కోత పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టు సభ్యులందరికి 6 లక్షల జరిమానా విధించారు. హార్దిక్ ఈ సీజన్‌లో రెండో సారి స్లో ఓవర్ రేట్‌కు కారుకుడు కావడంతో అతనికి భారీ జరిమానా పడింది.
కాగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. లక్నో బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది.
ఇషాన్ కిషన్ (32), నేహల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ (10), తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (0), మొహమ్మద్ నబీ (1) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మొహిసిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. ఆపసోపాలు పడి 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్టోయినిస్ (62) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి లక్నోను గెలిపించాడు. రాహుల్ (28), దీపక్ హూడా (18), పూరన్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు.
ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, గెరాల్డ్ కొయెట్జీ, నబీ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు కాగా.. లక్నో ఈ సీజన్ ఆరో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
Comments
Please login to add a commentAdd a comment