ఆహా.. ఆవకాయ | Sakshi
Sakshi News home page

ఆహా.. ఆవకాయ

Published Thu, May 16 2024 3:10 PM

ఆహా..

లరాయవరం: తెలుగు వారి లోగిళ్లు.. పచ్చళ్లకు కూడళ్లు అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పచ్చళ్లలో రాజు లాంటి ఆవకాయ గురించి ఎవ్వరికీ కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇంటింటా సుపరిచితమైన ఆవకాయపై ముఖ్యంగా తెలుగు వారికి పేటెంట్‌ ఉందని చెప్పవచ్చు. దీనిని పేదల నుంచి ధనికుల వరకూ ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని తింటారు.

సీజన్‌ వచ్చేసింది

వేసవి వచ్చిందంటేనే పచ్చళ్ల సీజన్‌ ప్రారంభమవుతుంది. ఉగాది పచ్చడిలో మామిడికాయ ముక్కలను వేస్తారు. అప్పటి నుంచే మామిడికాయలు తినడం ప్రారంభమవుతుంది. మామిడికాయలు పెరిగి పెద్దవై, పీచు కట్టిన తర్వాత పచ్చడి కాయలను కోసి అమ్మకాలు చేస్తారు. మామిడికాయ పచ్చడిని రకరకాలుగా పెట్టుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. ఆవకాయ, మాగాయ, బెల్లం ఆవకాయ, అల్లం ఆవ, మెంతి ఆవ ఇలా రకరకాలు ఉన్నాయి. వ్యవసాయ కుటుంబాల్లో సీజన్‌ వచ్చిందంటే చాలు పెద్ద జాడీల నిండా పచ్చళ్లను సిద్ధం చేసుకుంటారు. ప్రతి రోజూ అన్నంలో కూరలతో పాటు పచ్చడిని కలుపుకొని తింటారు. అలాగే కూలీలు, ఇతర పనులకు వెళ్లే వారి క్యారియర్‌లో ఆవకాయ పచ్చడి తప్పనిసరిగా ఉంటుంది.

కత్తెర సీజన్‌ ప్రారంభానికి ముందే..

ప్రస్తుత సీజన్‌లో ప్రతి కుటుంబం తమ శక్తికి తగ్గట్టు ఆవకాయ, మాగాయ పచ్చళ్లు తప్పనిసరిగా తయారు చేసుకుంటారు. సాధారణంగా కత్తెర సీజన్‌ ప్రారంభం కాకముందే వీటిని పూర్తి చేస్తారు. దేశవాళీ, సూదలు, రసాలు, సువర్ణరేఖ, కొత్తపల్లి కొబ్బరి, హైదర్‌ సాహెబ్‌ తదితర రకాల మామిడికాయలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. సాధారణ రకాల 100 కాయలు రూ.2,000 నుంచి 2,500 వరకూ, నాణ్యమైన రకాలైన హైదర్‌ సాహెబ్‌, కొత్తపల్లి కొబ్బరి వంటివి 100 కాయలను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకూ విక్రయిస్తున్నారు. పచ్చడి పట్టే మామిడి కాయలను ముక్కలుగా కొడుతూ కొందరు ఉపాధి పొందుతున్నారు. ఇందుకోసం ఒక్కో మామిడికాయకు రూ.2 చొప్పున తీసుకుంటున్నారు.

మరికొన్ని కారణాలు

గతంతో పోలిస్తే పచ్చళ్లు పట్టుకునే వారి సంఖ్య ఏడాదికేడాది తగ్గుతోంది. ప్రజల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటుగా అంగట్లో పలు రకాల రెడీమేడ్‌ పచ్చళ్లు దొర కడం దీనికి కారణమని చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్‌ వంటి వ్యాధు లు రావడంతో వైద్యుల సలహా మేరకు పచ్చడి తినడాన్ని చాలా మంది తగ్గిస్తున్నారు. పచ్చళ్ల తయారీ కేంద్రాల నుంచి నేరుగా మార్కెట్లోకి అందుబాటులోనికి వస్తున్నాయి. దీంతో అవసరమైన సమయంలో తమకు కావాల్సిన పచ్చడిని ఒక్కో ప్యాకెట్‌/బాటిల్‌ పచ్చడిని కొనుగోలు చేసుకుంటున్నారు.

ఆవకాయ పచ్చడి

పచ్చడి తయారీలో మహిళల నిమగ్నం

మార్కెట్‌లో మామిడికాయలకు డిమాండ్‌

పెరిగిన ఇతర వస్తువుల ధరలు

పచ్చళ్లకు ధరాఘాతం

మామిడికాయలతో పాటు పచ్చడి పట్టడానికి వినియోగించే గానుగ నూనె, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి ధరలు బాగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పచ్చడి పెట్టడం భారంగా మారుతుంది. కుంచుడు ముక్కలతో పచ్చడి పెట్టాలంటే దాదాపుగా రూ.2 వేలు ఖర్చవుతుంది. పెరిగిన ధరల కారణంగా పచ్చళ్లను పట్టుకునే పరిస్థితి లేదని పలువురు సాధారణ, మధ్య తరగతి వారు వాపోతున్నారు. అయినా పెరిగిన ధరలను తట్టుకోలేక తక్కువ పరిమాణంలో పట్టుకుంటున్నారు.

ఆహా.. ఆవకాయ
1/2

ఆహా.. ఆవకాయ

ఆహా.. ఆవకాయ
2/2

ఆహా.. ఆవకాయ

Advertisement
 
Advertisement
 
Advertisement