అభ్యర్థిని మార్చుతారా? | Sakshi
Sakshi News home page

అభ్యర్థిని మార్చుతారా?

Published Sat, Apr 20 2024 1:30 AM

- - Sakshi

● ‘కమలం’ పార్టీలో విస్తృతంగా చర్చ ● 24న నామినేషన్‌ వేస్తానంటున్న ‘గోమాసే’

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పెద్దపల్లి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారం ఆ పార్టీలో గందరగోళం రేపుతోంది. ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి చేరిన గోమాసే శ్రీనివాస్‌కు బీజేపీ అధిష్టానం టికెట్‌ ఖరారు చేసింది. తాజాగా అభ్యర్థిని మారుస్తారని అటు కేడర్‌లోనూ ఇటు ప్రజల్లో చర్చకు రావడంతో మార్పు ఉంటుందా..? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గోమాసే శ్రీనివాస్‌ పెద్దపల్లి పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసేందుకు పార్టీ బీఫాం తనకే అనే నమ్మకంతోనే ప్రచారం చేస్తున్నారు. అంతేకాక నామినేషన్‌ వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 24న భారీ ఏర్పాట్లతో బీజేపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో అభ్యర్థి మార్పు అనే ప్రచారం ‘గోమాసే’ అనుచర వర్గాలను కలవరపెడుతోంది. రెండు రోజుల క్రితం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు హైదరాబాద్‌కు వెళ్లి రాష్ట్ర పెద్దలను కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. జిల్లాలో రెండు వర్గాలు ఉండడంతో కొందరు ‘గోమాసే’నే కొనసాగించాలని కోరినట్లు సమాచారం. ఈ సమయంలో అభ్యర్థిని మార్చితే ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలుస్తోంది. అయితే ‘గోమాసే’ అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కొందరు ఇదే అవకాశంగా మార్చాలని పట్టుబడుతున్నట్లుగా పార్టీ నాయకులే చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం ప్రత్యర్థులే ఈ అనవసర ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.

వెంకటేనేశ్‌ నేత ప్రయత్నాలు

పెద్దపల్లి తాజామాజీ ఎంపీ, ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న బొర్లకుంట వెంకటేశ్‌ నేత బీజేపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన ఇప్పటి వరకు ఎటువంటి అధికార ప్రకటన లేదు. అయినప్పటికీ ఆయన సన్నిహితులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరితే టికెట్‌ ఇస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుత అభ్యర్థిని మార్చితే తమకు కూడా అవకాశం కల్పించాలని జిల్లా నుంచి ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారితోపాటు ప్రజాదరణ, పార్టీలో కలుపుకుపోయే వారికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ‘కమలం’ పార్టీలో అభ్యర్థి మార్పు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు అధిష్టానం, ఇటు జిల్లా నాయకత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో చివరకు బీఫాం ఎవరి చేతిదక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.

1/1

Advertisement
Advertisement