![బాలల హక్కులపై దృష్టి పెట్టండి](/styles/webp/s3/article_images/2024/05/18/17kgm427-192034_mr.jpg.webp?itok=dNcS86Hw)
బాలల హక్కులపై దృష్టి పెట్టండి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): బాలల హక్కులు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాల అమలు తదితర అంశాలపై శుక్రవారం కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సంరక్షణ కేంద్రాల ద్వారా బాలలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. వారికి పూర్తిస్థాయిలో సంరక్షణ అందించి ప్రయోజకులను చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల భద్రత, శ్రేయస్సుకు సంబంధించి ప్రభావితం చేసే సమస్యలపై కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఓపెన్ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వీధి బాలల వివరాలు సేకరించి విచారణ జరిపిన తర్వాత తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించాలని చెప్పారు. ఎవరూ ముందుకురాని అనాథలకు శిశు గృహాల్లో చేర్పించి పూర్తి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాలల గృహాలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించాలని అన్నారు. బాలల రక్షణ, బాల్య వివాహాల నిరోధం, బాల కార్మికుల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలలు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ ప్రియాంక ఆల పాల్గొని జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్‌డీఓ విద్యాచందన, డీడబ్ల్యూఓ విజేత, ఎస్‌డీసీ కాశయ్య, ఆర్డీఓలు మధు, దామోదర్‌రావు, ఎస్సీ సంక్షేమాధికారి ఇందిర, మైనార్టీ సంక్షేమాధికారి సంజీవరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ, డీసీఓ రుక్మిణీదేవి, డీఏఓ బాబురావు, పౌరసరఫరాల డీఎం త్రినాథ్‌బాబు, డీసీఓ ఖుర్షిద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment