![వెదురు సాగుతో సిరుల పంట](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10kgm422-192034_mr-1739218557-0.jpg.webp?itok=xuQFHU6I)
వెదురు సాగుతో సిరుల పంట
సూపర్‌బజార్(కొత్తగూడెం): వెదురు సాగు చేసిన రైతుల ఇంట సిరుల పంట పండుతుందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చండ్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాల అటవీ, ఇతర శాఖల సిబ్బందికి వెదురు పెంపకంపై కలెక్టరేట్‌లో సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వెదురు సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. జిల్లాలో వెదురుసాగుకు సులభమైన పద్ధతులు, వివిధ రకాల వెదురు సాగు, దానివల్ల ఉపయోగాలు, వెదురు ఉత్పత్తులు తదితర అంశాలపై రెండురోజుల పాటు శిక్షణ తరగతులు కొనసాగుతాయని వివరించారు. చండ్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాల భూములు వెదురుసాగుకు అనుకూలంగా ఉంటాయని, సాగుకు అవసరమైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఐదెకరాల భూమి, బోరు సౌకర్యం ఉన్న రైతులు ఒక ఎకరంలో వెదురుసాగు చేసేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వెదురుసాగుతో ఆర్ధికాభివృద్ధి చెందుతారని అన్నారు. మునగ, వెదురు పంటల సాగు అన్ని సమస్యలకు పరిష్కారమని చెప్పారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వెదురును విరివిగా వినియోగిస్తున్నారని, నంద్యాలలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ వారు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఉద్యాన శాఖాధికారి కిషోర్, ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ రమ్య, డాక్టర్ శ్రీకాంత్, ఆపరేషన్ మేనేజర్లు అమృత, అక్షయ్, టెక్నికల్ మేనేజర్ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment