అండగా దోస్త్‌.. కోర్సులు మస్త్‌ | Sakshi
Sakshi News home page

అండగా దోస్త్‌.. కోర్సులు మస్త్‌

Published Thu, May 16 2024 2:25 PM

అండగా

● కొనసాగుతున్న తొలివిడత ప్రవేశాల ప్రక్రియ ● ఉమ్మడి జిల్లాలో 13 ప్రభుత్వ, 30కి పైగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు

నిర్మల్‌ఖిల్లా: ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ తెలంగాణ) ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గానూ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీబీఎం, తది తర కోర్సుల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని డిగ్రీ కళాశాలలన్నీ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సందేహాల నివృత్తికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలని, తప్పుగా నమోదు చేసినట్లు నిర్ధారించుకుంటే హెల్ప్‌లైన్‌ కేంద్రాలను సంప్రదించాలని కోరుతున్నారు.

సంప్రదాయ కోర్సులకు డిమాండ్‌..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, దాదాపు 30 వరకు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులోని అన్ని రకాల కోర్సుల్లో కలిపి దాదాపు 18 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. డిగ్రీలో సంప్రదాయ కోర్సులకు ఆదరణ ఎక్కువగా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్తరకం ఉపాధి కోర్సులను కూడా ప్రారంభిస్తోంది.

ప్రవేశాలు మూడు దశల్లో...

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు మూడు విడతల్లో జరగనున్నాయి. మే 6 నుంచి మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రూ.200 రుసుంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుండి 30 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్‌ 6న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 7 నుండి 12 వరకు కేటాయించబడిన కళాశాలల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన తేదీల ప్రకారం రెండవ దశ, మూడవ దశ లో అడ్మిషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

రెండో దశ..

రూ.400 రుసుంతో జూన్‌ 6 నుంచి 13 వరకు సెకండ్‌ ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 6 నుంచి 14 వరకు సెకండ్‌ ఫేజ్‌ వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. జూన్‌ 18న రెండో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్‌ 19 నుంచి 24 వరకు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం కల్పించారు.

మూడో దశ..

జూన్‌ 19 నుంచి 25 వరకు ‘దోస్త్‌’ మూడో దశ రిజిస్ట్రేషన్‌ ఉండనుంది. రూ.400 రుసుంతో మూడో విడత రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. జూన్‌ 19 నుంచి 25 వరకు మూడో దశ వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. జూన్‌ 29న మూడో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జులై 8 నుంచి డిగ్రీ కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయి.

మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా దరఖాస్తు..

మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా దోస్త్‌ దరఖాస్తు చేసుకోవచ్చని హెల్ప్‌ డెస్క్‌ అధికారులు పేర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్లలోని ప్లే స్టోర్‌ నుంచి డిగ్రీ దోస్త్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందులో సూచించిన ప్రకారం మొబైల్‌ నంబర్‌ ఓటీపీతో వెబ్‌సైట్లోకి ప్రవేశించి సంబంధిత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వెబ్‌ ఆప్షన్ల తర్వాత ఏ కాలేజీలో సీట్‌ అలాట్‌ అయిందో కూడా తెలుసుకోవచ్చు. వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సమీపంగా ఉన్న వాటిని ముందుగా ఎంచుకుని ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో దూరంగా ఉన్న వాటిని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. కోర్సులు కూడా తమకు నచ్చిన వాటిని తొలుత, ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలని కోరుతున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఎన్నో కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వృత్తి విద్యా కోర్సులతో పాటు సంప్రదాయ డిగ్రీ కోర్సులకు సైతం డిమాండ్‌ ఉంది. కిందిస్థాయి ఉద్యోగాల నుంచి సివిల్స్‌ వరకు జరిగే పోటీ పరీక్షలలో డిగ్రీ సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. డిగ్రీ కనీస అర్హతగా కొనసాగుతోంది కాబట్టి విద్యార్థులు కోర్సును ఎంచుకునే ముందు ఆలోచించి ఎంపిక చేసుకోవాలి. పట్టుదలతో శ్రమించి తగిన నైపుణ్యాలు పెంపొందించుకుంటే భవిష్యత్‌లో మంచి రంగంలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది.

– డా.రవికుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,

దోస్త్‌ జిల్లా సమన్వయకర్త, నిర్మల్‌

అండగా దోస్త్‌.. కోర్సులు మస్త్‌
1/1

అండగా దోస్త్‌.. కోర్సులు మస్త్‌

Advertisement
 
Advertisement
 
Advertisement