అవసరమైతేనే బయటకు రావాలి | Sakshi
Sakshi News home page

అవసరమైతేనే బయటకు రావాలి

Published Sat, Apr 20 2024 1:20 AM

- - Sakshi

కన్నాయిగూడెం: అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎంసీహెచ్‌ వైద్యుడు ఎం.గిరి అన్నారు. మండలంలోని సర్వాయిలో శుక్రవారం డాక్టర్‌ గిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చల్లని తాగునీరు, ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం మంజూవాణి, హెల్త్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌, ఆశలు పాల్గొన్నారు.

డీపీఓగా బాధ్యతల స్వీకరణ

ములుగు: ములుగు జిల్లా పూర్తి అదనపు స్థాయి పంచాయతీ అధికారి (డీపీఓ)గా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శ్రీనివాస్‌కుమార్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ములుగు డీపీఓ కొండా వెంకయ్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ డీపీఓ జగదీశ్‌ నియమితులయ్యారు. వచ్చిరాగానే ఆయన ఆరోగ్యపరమైన కారణాలతో లాంగ్‌లీవ్‌పై వెళ్లారు. దీంతో డీఎల్‌పీఓగా ఉన్న స్వరూపను ఇన్‌చార్జ్‌ డీపీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మూడు నెలల వ్యవధిలో స్వరూపను అనివార్య కారణాలతో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మూడు రోజుల క్రితం కమిషనరేట్‌కు సరేండర్‌ చేశారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌కుమార్‌ను కార్యాలయ సిబ్బంది, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

‘బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది’

ములుగు: ఆదిలాబాద్‌ జిల్లా బాధ్యతలు మంత్రి సీతక్కకు అప్పగించినప్పుడే బీజేపీ నాయకులకు పార్లమెంట్‌ ఎన్నికల ఓటమిభయం పట్టుకుందని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్‌ తరలివెళ్లే క్రమంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సీతక్క, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రావి శ్రీనివాస్‌లపై పాల్వాయి హరీష్‌బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశసంపదను కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. హరీష్‌ బాబు తనవాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అ ధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసిందని, గడిచిన 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం నిరుపేదల కోసం ఏం చేసిందో చెప్పాలని అడిగారు. ఆయన వెంట పార్టీ ముఖ్య సంఘాల నాయకులు ఉన్నారు.

కరెంట్‌ ఉచ్చులకు తగిలి

పాడిగేదెల మృతి

ఏటూరునాగారం: మండలంలోని ముళ్లకట్ట గ్రామ శివారులో పంట చేనును కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు ఉచ్చుకు తగిలి నాలుగు పాడిగేదెలు మృతి చెందాయి. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ముళ్లకట్ట గ్రామానికి చెందిన ముడుత రా మయ్య, సత్యంకు చెందిన నాలుగు పాడిగేదెలు కరెంటు ఉచ్చులకు తగిలి మృతి చెందాయి. పశువులు రోజు వారిలాగానే పంట పొలాలు, అటవీ ప్రాంతాలకు మేతకు వెళ్లాయి. గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన గేదెలు రాకపోవడంతో వాటిని వెతుకుంటూ వెళ్లిన రైతులకు కరెంటు ఉచ్చులకు తగిలి మృతి చెందాయని బాధితులు బోరునావిలపించారు. సుమారు వాటి విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ముగ్గురి అరెస్ట్‌

అడవిలోని జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్‌ వైరును అమర్చి 4 గేదెల మృతి కారణమైన ముల్లకట్ట గ్రామానికి చెందిన గడ్డం రమేష్‌, కొరిసే నర్సింహులు, మంతెన చిట్టిబాబులను అరెస్టు చేసినట్లు ఎస్సై జి.కృష్ణప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో జంతువులను వేటాడేందుకు కరెంటు వైరును అమర్చగా వాటికి గేదెలు తగిలి మృతి చెందినట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement