రెచ్చిపోతున్న పచ్చమూక పల్నాడులో ఆగని విధ్వంసం | Post Poll Violence In AP: Attack On YSRCP Leaders With Iron Bars In Palnadu, More Details Inside | Sakshi
Sakshi News home page

Post Poll Violence In AP: రెచ్చిపోతున్న పచ్చమూక పల్నాడులో ఆగని విధ్వంసం

Published Thu, May 16 2024 5:42 AM

Attack on YSRCP leaders with iron bars in palnadu

వైఎస్సార్‌సీపీ నేతలపై ఇనుపరాడ్లతో దాడి

భయాందోళనలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు

ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా ఇంకా ఉద్రిక్తతలు

జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు 

దుకాణాలు బంద్, అనుమానితుల బైండోవర్‌ 

గృహనిర్బంధంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, కాసు, గోపిరెడ్డి 

సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడు జిల్లాలో టీడీపీ మూకల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ మూకలు బుధవారం దాడులకు పాల్ప­డ్డా­యి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ దాడుల నుంచి తప్పించుకొని గ్రామాలు వదిలివెళ్లిపోయిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఇంకా ఇళ్లకు పూర్తిగా చేరుకోలేదు. 

తెలిసిన వారి ఇళ్లల్లో దూరప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కుటుంబంలోని మహిళలు, పిల్లల బాగోగుల గురించి వార­ంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే గ్రామాలకు తిరిగిరావాలని చూస్తున్నారు. మరోవైపు మాచర్ల, గురజాల, నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్‌ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 

టీడీపీ మూక స్వైరవిహారం.. 
మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో గ్రామ­ం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఇంకా గ్రామా­లకు చేరలేదు. పోలీస్‌ పికెటింగ్‌ ఉన్నా మళ్లీ టీడీపీ మూకలు దాడులు చేస్తాయనే అభద్రతాభావంతో గ్రామా­నికి దూరంగా ఉంటున్నారు. పల్నాడు జిల్లా­లో పలు ప్రాంతాల్లో టీడీపీ మూకలు విధ్వంసకాండ కొనసాగిస్తుండటంతో పోలీసులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్‌ విధించారు. 

ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో దుకాణాలను మూసివేయి­ంచారు. చివరకు  కొన్నిచోట్ల మెడికల్, కూరగాయ­లు, పాల దుకాణాలు, టీస్టాల్స్‌ను కూడా తెరవలేదు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి మించి గుమి­గూడకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ టీడీపీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటు వేయని వారిపై దాడులు కొనసాగిస్తున్నారు. 

గ్రామానికి తిరిగిరాగానే పచ్చ మూకల దాడి.. 
గురజాల నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యకాండ కొన­సా­గుతోంది. పల్లెల్లో టీడీపీ ఫ్యాక్షన్‌  చిచ్చురేపు­తోంది. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలింగ్‌ రోజునే ఆదిరెడ్డితో టీడీపీ నాయకులు వాగి్వవాదానికి దిగారు. పోలింగ్‌ ముగిశాక గ్రామంలో పరిస్థితి బాగోలేకపోవటంతో రెండు రోజులపాటు వేరే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటిలో ఆయన తలదాచుకున్నాడు. 

బుధ­వారం ఉదయం మాదినపాడు చేరుకున్న వెంటనే 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కర్రలు, ఇనుపరాడ్లతో ఆదిరెడ్డిపై దాడి చేశా­రు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని ఆదిరెడ్డిని పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆదిరెడ్డి తలలో నరాలు తెగి రక్తప్రసరణ నిలిచిపోయిందని.. రెండు మేజర్‌ సర్జరీలు చేయాలని వైద్యులు చెబుతున్నారు.  

వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నం.. 
నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షుడు కోవెలమూడి సాంబశివరావుపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. పోలింగ్‌ రోజు పన్నెండో బూత్‌లో ఎస్సీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో బారులు తీరి రాత్రి 7 గంటల వరకు ఓట్లేశారు. వీరికి సాంబశివరావు అండగా ఉన్నాడు. 

ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు ఆయనపై దాడికి దిగారు. మరికొంతమందిపై కూడా దాడి చేసేందుకు కారులో వెంటపడ్డారు. అలాగే పిడుగురాళ్ల మండలం బ్రాహ్మ­ణç­³ల్లిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు వెంకయ్య, విజయేంద్రబాబుల ఇళ్లపై దాడి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గురజాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

ఎమ్మెల్యేల హౌస్‌ అరెస్ట్‌.. 
పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు కీలక నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేసి వారిని ఇంటికే పరిమితం చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను హౌస్‌ అరెస్ట్‌లో ఉంచారు. 

మరో­వైపు అల్లర్లకు కారణమైన టీడీపీ, వైఎస్సా­ర్‌సీపీ కార్యకర్తలపై జిల్లావ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా నేరస్వభావం ఉన్న వారిని బైండోవర్‌ చేశారు. దీంతో వందలాది మంది గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు మకాం మార్చారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement