గుట్టుగా సాగుతున్న మాకద్రవ్యాల దందా
బెంగళూరు నుంచి తెచ్చి ఎండీఎంఏ విక్రయం
సిటీలో మరో ముగ్గురితో కలిసి చేస్తున్న వైనం
అరెస్టు చేసిన టీఎస్–నాబ్‌కు చెందిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు నుంచి డ్రగ్స్ ఖరీదు చేసుకోవచ్చు, నగరంలో విక్రయిస్తున్న భార్యభర్తల దందాకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–నాబ్) అధికారులు చెక్ చెప్పారు. ఈ దంపతులుసహా ఐదుగురిని అరెస్టు చేసి, రూ.4 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్ స్వా«దీనం చేసుకున్నట్లు టీఎస్–నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య బుధవారం వెల్లడించారు. అంబర్‌పేటకు చెందిన సయ్యద్ ఫైజల్ పెట్స్ విక్రయిస్తుంటాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ దందా మొదలెట్టాడు. ఇతడిపై గతంలో అంబర్‌పేట, బాలానగర్ ఎక్సైజ్ పోలీసుస్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి.
కొన్నిసార్లు భార్య ముస్రత్తున్నిస్సా బేగంతో కలిసి ఈ దందా చేయడంతో ఆమె పైనా ఓ కేసు నమోదైంది. జైలుకు వెళ్లివచ్చినా తమ పంథా మార్చుకోలేదు. బెంగళూరుకు చెందిన జునైద్ ఖాన్, డబీర్‌పుర వాసి మహ్మద్ అబ్రార్, రహ్మత్ ఖాన్‌లను తమతో కలుపుకున్నారు. జునైద్ డ్రగ్ సరఫరాలో సహకరిస్తుండగా... మిగిలిన ఇద్దరూ నగరంలో కస్టమర్లను గుర్తించేవారు. పోలీసుల నిఘా పెరిగిందని గుర్తించిన సయ్యద్, వారికి చిక్కకుండా ఉండటం కోసం కొత్త పంథా మొదలెట్టాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తూ పెడ్లర్‌గా మారాడు. కస్టమర్లకు సరఫరా చేయడానికి మస్రత్తున్నిస్సా బేగంను ట్రాన్స్‌పోర్టర్‌గా వాడుతున్నాడు.
బెంగళూరుకు వెళ్లి వచ్చా...
ఇటీవల బెంగళూరు వెళ్లిన ఈ నలుగురు నిందితులు అక్కడ జునైద్‌ను కలిసి 34 గ్రాముల ఎండీఎంఏ ఖరీదు చేశారు. అనంతరం జునైద్‌తో కలిసి వారు నగరానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్–నాబ్ అధికారులు బహదూర్‌పుర పోలీసులతో కలిసి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రూ.4 లక్షల విలువైన డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి క్రమం తప్పకుండా డ్రగ్ ఖరీదు చేస్తున్న 19 మంది కస్టమర్లను పోలీసులు గుర్తించారు.
ఒక్కో గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కస్టమర్ల పైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడానికి కృషి చేస్తున్నామన్న పోలీసులు వీటిపై సమాచారం తెలిస్తే 87126–71111 నెంబర్‌కు ఫోన్ చేసి లేదా ( tsnabho& hyd@tspolice. gov. in)కు ఈ–మెయిల్ ద్వారా తెలపాలని కోరారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment